Tuesday, November 26, 2024

వరి కుంపటి ! జిల్లాలో 50వేల ఎకరాల్లో వరి పంట… ప్రభుత్వ కొనుగోలుపై స్పష్టత కరువు

ప్రభన్యూస్‌ : యాసంగి (రబీ) లో వరి పంటను సాగు చేయవద్దు అని సీజన్‌కు ముందే ప్రభుత్వం రైతులకు సూచించింది. వరిధాన్యం సేకరణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ సూచన చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరి సాగు వద్దు అంటూ రైతులకు సూచనలు చేశారు. యాసంగిలో రైతులు పండించే వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం పేచీలు పెడుతోంది. రబీలో రైతులు పండించిన వరిధాన్యంను ఉప్పుడు బియ్యంగా మార్చిన తరువాత కేంద్రం తీసుకుంటుంది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. సేకరించిన వరిధాన్యంను పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించి ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రంకు అందజేస్తారు. అయితే ఈ ఏడాది నుంచి ఉప్పుడు బియ్యంను సేకరించబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉప్పుడు బియ్యంకు డిమాండ్‌ తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే మన రైతులు రబీలో పండించిన వరిధాన్యం ఉప్పుడు బియ్యంగా మాత్రమే పనికి వస్తుంది. కేంద్ర వైఖరితో రబీలో వరిధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం వద్దు అని చెప్పినా జిల్లాలో మాత్రం రైతులు రబీలో పెద్ద ఎత్తున వరి సాగును చేపట్టారు.

గత ఏడాది జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. ఈసారి వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం జిల్లాలో 45 వేల ఎకరాలలో వరి పంట సాగు అవుతోంది. వాస్తవంగా మాత్రం జిల్లాలో మరింత ఎక్కువ విస్తీర్ణంలోనే వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. బోర్లు.. ప్రాజెక్టులు.. చెరువుల కింద పెద్ద ఎత్తున రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ సారి దాదాపు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత రబీలో జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే బహిరంగ మార్కెట్‌కు తరలించడం తప్ప రైతులకు మరో మార్గం లేదు.

వరిధాన్యంకు మద్దతు ధర క్వింటాలుకు రూ.1960 ఉంది. ప్రభుత్వ ప్రమేయం లేకపోతే బహిరంగ మార్కెట్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. రబీలో రైతులు పండించిన వరిధాన్యంకు బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.1300 వరకు చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. పొరుగు ఉన్న కర్ణాటకలో రబీలో ఉత్పత్తి చేసిన వరిధాన్యంను క్వింటాలుకు రూ.1100 చెల్లించి అక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే జరిగితే వరిధాన్యం రైతులు భారీగా నష్టపోవడం ఖాయం. అయితే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం సాగించాలని అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్దమయ్యారు. ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా యాసంగిలో రైతులు పండించిన వరిధాన్యంను సేకరించాలని కేంద్రంను డిమాండ్‌ చేస్తున్నారు. ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు సైతం వరిధాన్యం రైతుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు. రైతులు పండించిన మొత్తం వరిధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తంగా రైతులు సాగు చేసిన వరి పంట రాష్ట్రంలో రాజకీయ దుమారం సృష్టిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement