తెంపరితనం.. ప్రాణ సంకటం..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు తెలియని వారుండరు. అగ్రరాజ్యమైన అమెరికాకు అతను అధ్యక్షుడు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డోనాల్డ్ ట్రంప్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమెరికా దేశాధ్యక్షుడిగా ఆయనను కొందరు ఇష్టపడతారు.. మరికొందరు ద్వేషిస్తారు. అమెరికా (America) లో కొందరు ఆయనకు అభిమానులున్నా.. తన నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయితే ఈయన రెండోసారి పదవిలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా సంచలన నిర్ణయాల (Sensational decisions) తో వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంప్ తనదైన విధంగా ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నారు. సుంకాలు, వాణిజ్య యుద్ధాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచాన్ని ఒకింత ఉలిక్కిపడేలా చేస్తున్నారు.

ట్రంప్ తీసుకున్న అతిపెద్ద షాకింగ్ నిర్ణయాలు నాటో, డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలగడం, భారతదేశం-చైనా (India-China) తో సహా అనేక దేశాలపై అధిక సుంకాలు విధించడం, అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు. ఇలా వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యలా మారారు. తన పాలన ద్వారా ప్రశంసలు పొందుతున్నారా.. విమర్శలు ఎదుర్కొంటున్నారా..? అంటే అధిక శాతం విమర్శలు ఎదుర్కొంటున్నారనే చెప్పవచ్చు. ఈయన మాదిరిగా గతంలో అమెరికా అధ్యక్షుడు (US president) గా పనిచేసిన వారెవరూ ఇలాంటి చెత్త నిర్ణయాలు, నిబంధనలు, ఆంక్షలు విధించిన దాఖలాలు లేవన ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్… ఫ్రెండ్ అంటూ.. భారత్ (India) ను ఆలింగనం చేసుకుంటూనే సుంకాలు పెంచి మిత్రద్రోహం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పిచ్చి పాలనతో భూగోళంపై విలయ తాండవం చేస్తున్నారని వివిధ దేశాలు ఆయన పై గుర్రుగా ఉన్నాయి. ట్రంప్‌ మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తిగా ప్రచారం పొందినా… అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుపొందడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వ్యక్తిగతం కూడా వివాదాస్పదమే
78 ఏళ్ల ట్రంప్ మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ ఇవానా (Ivana) ను పెళ్లాడారు. 1977 నుంచి 1990 వరకు ఆమెతో కలిసున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్ (Marla Maples) ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 వరకు వారి బంధం కొనసాగింది. వీరిద్దరు కూడా విడాకులు తీసుకొని వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలానియా (Model Melania) తో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్ ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. ఇలా కుటుంబ నేపథ్యం కూడా కొంత వివాదాస్పదం అని చెప్పవచ్చు. ఇలా రాజకీయాల్లో, కుటుంబ నేపథ్యంలో సంచలనంగా మారిన ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్ లో అతి పెద్ద వివాదాస్పద నిర్ణయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్రమ వలసదారులపై మొద‌టి క‌త్తి
ట్రంప్ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వారిని దేశం నుండి బహిష్కరించారు. అమెరికా (America) ఈ అక్రమ వలసదారులను తన సైనిక విమానాల ద్వారా వారి దేశానికి తిరిగి పంపించింది. ఇది అమెరికా, అనేక దేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.

నాటోను విడిచిపెట్టడం..
డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత షాకింగ్ నిర్ణయం నాటో నుండి తనను తాను దూరం చేసుకోవడం. ఒక విధంగా అమెరికా నాటోను పెంచి పోషించింది. అమెరికా అధ్యక్షులు (US president) ఎవ‌రైనా నాటోకు పూర్తి మద్దతు ఇచ్చేవారు. కానీ ట్రంప్ వచ్చిన వెంటనే నాటోకు దూరంగా ఉన్నాడు. యూరోపియన్ మిత్రదేశాలు అమెరికాపై ఆధారపడుతున్నాయని, రక్షణ కోసం ఖర్చు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అతను అమెరికా నాటో నుండి వైదొలుగుతానని కూడా బెదిరించాడు.

కెనడాను 51వ రాష్ట్రం అభివర్ణించడం..
ట్రంప్, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమెరికా విస్తరణ గురించి మాట్లాడారు. ఇది అతని యూరోపియన్ మిత్రులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆయన కెనడా (Canada) ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా అనేకసార్లు అభివర్ణించారు. గ్రీన్‌ల్యాండ్‌, పనామా, గాజాను కూడా నియంత్రించాలనే తన కోరికను ఆయన వ్యక్తం చేశారు.

సుంకాల బాంబు పేల్చిన ట్రంప్
ట్రంప్ పరస్పర సుంకాలను విధించడం అతిపెద్ద నిర్ణయం. తమ దేశాల్లో అమెరికన్ వస్తువులపై సుంకాలు విధించిన అన్ని దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన డెడ్‌లైన్ ప్రకారం కొన్ని దేశాలపై సుంకాన్ని పెంచేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి టారిప్‌ల‌ను పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. యావత్ ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఆగస్టు ఏడో తేదీ నుంచి కొన్ని దేశాలపై అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు కూడా అమెరికా వాణిజ్య శాఖ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఒకవేళ ఏదైనా విదేశీ కంపెనీ తమ ఉత్పత్తులను అమెరికాలో అమ్మాలనుకుంటే, వాటినిపై అక్కడి ప్రభుత్వం సుంకాన్ని వసూల్ చేస్తుంది. ఇప్పుడు ఆ టారిప్‌ల‌ను ట్రంప్ పెంచేశారు. దీని వల్ల వినియోగదారులపై ఆయా కంపెనీలు అదనపు భారాన్ని మోసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ తన కొత్త టారిఫ్‌ విధానాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఆదేశంతో ఖరారు చేశారు. ఏయే దేశాలపై ఎంత సుంకం విధిస్తున్నారన్న విషయాన్ని వైట్‌హౌజ్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.

డబ్ల్యుహెచ్ఓ కి బైబై…
కరోనా (Corona) కాలం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రంప్ లక్ష్యంగా ఉంది. తన రెండవ పదవీకాలంలో, అతను అమెరికాను దాని నుండి బయటకు తీసుకెళ్లాడు. ఇప్పటివరకు అమెరికాకు అతిపెద్ద నిధులు సమకూర్చేది. ప్రస్తుతం చైనా నిధులు సమకూరుస్తోంది, కానీ అది అమెరికా స్థానాన్ని భర్తీ చేయగలదో లేదో చెప్పడం కష్టం.

యూఎస్ఏఐడీపై నిషేధం
అమెరికా ఇతర పేద దేశాలకు ఇచ్చే యూఎస్ఏఐడీ (USAID) (సహాయ ధనాన్ని) ట్రంప్ నిషేధించారు. అమెరికా పేద దేశాలకు తాగునీటి నుండి ఆహార ధాన్యాలు, మందుల వరకు ప్రతిదానికీ నిధులు అందించేది. ఇది కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనేక రకాల రాయితీలను కూడా ఇచ్చింది. ఆయన నిర్ణయం వల్ల పేద దేశాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఉక్రెయిన్‌ను ఒంటరి చేసి..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వైఖరికి పూర్తి విరుద్ధంగా, ట్రంప్ ఉక్రెయిన్‌ను ఒంటరిగా విడిచిపెట్టారు. వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ మ‌స్క్‌తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు, పుతిన్‌తో నిరంతర ఫోన్ సంభాషణల కారణంగా ట్రంప్ వార్తల్లో నిలిచారు. ట్రంప్ వచ్చినప్పటి నుండి, ప్రపంచంలో రష్యా ప్రభావం కూడా పెరిగింది. అమెరికా, రష్యాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిపింది.

అమెరికన్ విశ్వవిద్యాలయాలతో వివాదం
ట్రంప్‌న‌కు అమెరికన్ విశ్వవిద్యాలయాలతో కూడా వివాదం ఉంది. అతను ఈ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని సెమిటిక్ వ్యతిరేక, హమాస్ అనుకూల విశ్వవిద్యాలయాలుగా అభివర్ణించాడు. చాలా మంది ఉద్యమకారుల విద్యార్థులను కూడా దేశం నుంచి బహిష్కరించారు. నిధులు నిలిపివేశారు. ట్రంప్ అమెరికా (America) లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను తగ్గించి, ప్రభుత్వ ఉద్యోగాలలో తొలగింపులు ప్రారంభించారు. వృధా ఖర్చులను ఆపడానికి, ఎల‌న్ మస్క్ నేతృత్వంలోని డోఘే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించింది. దీని వల్ల అమెరికాలో కూడా అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి.

గతసారి ఇరాన్‌తో..
అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ట్రంప్, ఈ పదవీకాలంలో దానితో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. అలా చేయకపోతే ఇరాన్ కు గుణపాఠం నేర్పుతామని కూడా వారు బెదిరిస్తున్నారు.

ట్రంప్, మస్క్ గొడవ..
డోజ్ శాఖ నుంచి వైదొలిగిన ఎలాన్ మస్క్ (Elon Musk), అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అటు ట్రంప్ కూడా టెస్లా అధినేతకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ కు చెందిన టెస్లా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపించాయి. తన మద్దతు లేకపోతే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన జెఫ్రీ ఎప్సిటీన్ తో డొనాల్డ్ ట్రంప్ న‌కు సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. కనుక అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ను అభిశంసించాలని అన్నారు. దీనిపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మస్క్ కు చెందిన వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. “మస్క్ అంత ప్రభావవంతమైన వ్యక్తి కాదు. దేశంలోని ప్రతి ఒక్కరూ బలవంతంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా ఆయన ఒత్తిడి చేయాలని అనుకుంటున్నారు. దానికి నేను అంగీకరించలేదు. వెళ్లిపొమ్మని చెప్పా. అందుకే ఆయన ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు” అని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్రూత్‌లో రాసుకొచ్చారు.

మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూనే…
ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలంలో భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించారు. రెండోసారి ఎన్నికలకు ముందు హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ భాగమయ్యారు. ఇరువురు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా అభివర్ణించుకునేవారు. అయితే ట్రంప్ 2.0 పాలనలో భారత్ (India) కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. సుంకాలు విధించడం, భారత్- పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించడం, రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించొద్దని బెదిరించడం వంటివాటికి పాల్పడుతున్నారు. ఈ మూడు ప్రధాన కారణాలు అమెరికా, భారత్ మధ్య ఫ్రెండ్ షిప్‌ బెడిసికొట్టింది.

Leave a Reply