trump3reasons | ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..

trump3reasons | ఇరాన్‌పై దాడులకు ట్రంప్ బ్రేక్..
trump3reasons | అనూహ్య నిర్ణయం వెనుక వ్యూహం ఏంటి?
ఆయుధాలు, ఆర్థిక ఒత్తిడి ప్రభావం
దౌత్య చర్చలు.. శాంతి దిశగా అడుగులా?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఐదు రోజుల పాటు ఇరాన్ పై దాడులకు బ్రేక్ వేస్తున్నామన్నారు. రెండు రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయన్నారు
ట్రంప్ ఈ అనూహ్య నిర్ణయం వెనకున్న అసలు వ్యూహం ఏంటి?
నిన్నటి దాకా నిప్పులు కురిపించిన అమెరికా.. నేడు ఒక్కసారిగా శాంతి మంత్రాన్ని జపించడం వెనకున్న కారణాలేమిటి?
నిన్నటిదాకా “ఇరాన్‌ను వదిలేది లేదు.. యుద్ధం ఆపేది లేదు” అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అనూహ్యంగా ఐదు రోజుల పాటు దాడులకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది.

అయితే, ఈ మార్పు వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? లేక ఇది కేవలం తదుపరి భారీ దాడుల కోసం వ్యూహాత్మక విరామమా? అనే సందేహం కూడా కలుగుతోంది.
ఒకవేళ అందరూ ఊహిస్తున్నట్టు వ్యూహాత్మక వెనకడుగు అయితే గనుక, అందుకు గల మూడు బలమైన కారణాలు ఇవే కావచ్చని విశ్లేషకుల అంచనా.
1. ఆయుధాల నిల్వపై ఒత్తిడి
వినడానికి ఇది కొంత విడ్డూరంగా అనిపించవచ్చు. అమెరికా వంటి అగ్రరాజ్యానికి ఆయుధాల కొరత రావడం అసాధ్యం అనిపించవచ్చు కానీ, ఇరాన్ పై జరిపిన నిరంతర దాడుల వల్ల ఖరీదైన గైడెడ్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇరాన్ తో యుద్ధం ఆరంభించేనాటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల్లో అమెరికా భారీగా ఆయుధాలను సరఫరా చేసింది. దీంతో స్వదేశీ నిల్వలను సమన్వయం చేసుకోవడానికి మరియు వ్యూహాత్మక ప్రాంతాలకు ఆయుధాలను తరలించడానికి ఈ విరామం ఉపయోగించుకోవాలని ట్రంప్ వ్యూహం కావచ్చు.
2. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక లోటు మరియు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు:
యుద్ధం అంటే బిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చు. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి, ఇది అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై మాత్రమే కాక, అమెరికా అంతర్గత మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకపోతే తన పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబికే ప్రమాదం లేకపోలేదు. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఒక తాత్కాలిక విరామం తప్పనిసరిగా అవసరమని ట్రంప్ భావించి ఉండవచ్చు.
3. దౌత్య మార్గం – బందీల విడుదల:
రెండు రోజులుగా జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా బందీల విడుదల మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణల గురించి ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో దౌత్యపరంగా విజయం సాధిస్తే, యుద్ధం కొనసాగించే అవసరం లేకుండానే ట్రంప్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించానని భావించవచ్చు.. ఇది తనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇస్తుంది.
అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా తన మిత్రదేశాల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధాన్ని ప్రోత్సహించే స్థితిలో లేవు.
ట్రంప్ వ్యవహార-పరిపాలన శైలి ఎప్పుడూ ‘గరిష్ట ఒత్తిడి‘ చుట్టే తిరుగుతుంది. భీకరంగా దాడులు చేస్తూనే, మరోపక్క చర్చలకు ఆహ్వానించడం ద్వారా శత్రువును అయోమయానికి గురిచేయడం ట్రంప్ పాత వ్యూహమే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పైకి బింకంగా ఉన్న ట్రంప్ ధోరణిలో ఈ మార్పు శాంతికి నాంది పలుకుతుందా? లేక తుపానుకు ముందున్న ప్రశాంతమైన నిశ్శబ్దమా? అనేది మరో ఐదు రోజుల్లో తేలిపోనుంది. ఇరాన్ పట్ల ట్రంప్ చూపుతున్న ఈ ‘సాఫ్ట్ కార్నర్‘ వెనుక ఏదైనా పెద్ద ఒప్పందం కుదిరిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
