Trump-Rules-Out-Nuclear-Strike : అణు బాంబు అక్కర్లేదు.. ! Andhra Prabha Top Story

Trump-Rules-Out-Nuclear-Strike : అణు బాంబు అక్కర్లేదు.. ! Andhra Prabha Top Story

  • మామూలు బాంబులు చాలు
  • ఇరాన్‌పై ట్రంప్‌ స్పష్టీకరణ..
  • మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’పై మౌనం
  • పికాక్స్‌ మౌంటెన్‌ పై మళ్లీ గురి
  • త్వరలోనే మరో దాడికి అవకాశం
  • భూతల దళాలు వెనక్కి
  • అమెరికా దూకుడుకు బ్రేక్

(వాషింగ్ట‌న్ . ఆంధ్రప్రభ ప్రతినిధి)

అణ్వాయుధాల ప్రయోగంపై ఇన్నాళ్లూ ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తొలిసారిగా తన వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్‌పై అణుబాంబు ప్రయోగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే, అణ్వాయుధేతర బాంబుల్లో అత్యంత విధ్వంసకరమైనదిగా పేరొందిన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ను ప్రయోగించే అవకాశాలపై మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడబోతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అమెరికాకు చెందిన న్యూస్‌మ్యాక్స్‌ మీడియా సంస్థకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాన్ని ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేస్తూనే.. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అణుబాంబు కాదని పేర్కొన్నారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమెరికా.. అవసరమైతే మరోసారి దాడులకు దిగవచ్చన్న సంకేతాలనూ ఆయన మాటలు వెలువరిస్తున్నాయి.

అణుబాంబు అక్కర్లేదు!

‘‘నేను అణ్వాయుధాన్ని ఉపయోగించను. అలాంటి అవసరం మాకు లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ శక్తి అమెరికా’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అణ్వాయుధాన్ని లేదా వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ప్రయోగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై మరోసారి దాడులు జరిపే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. ముఖ్యంగా పికాక్స్‌ మౌంటెన్‌ ప్రాంతంపై అమెరికా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రానైట్‌ శిలల పొరల కింద లోతుగా నిర్మించినట్లు భావిస్తున్న ఇరాన్‌ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అమెరికా ప్రభుత్వం ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ ప్రయోగాన్ని పరిశీలిస్తోందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన ట్రంప్‌.. ఆ బాంబు అణ్వాయుధం కాదని పునరుద్ఘాటించారు. అయితే, ఇరాన్‌పై దాని ప్రయోగానికి తాను అనుమతి ఇచ్చానా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ ఎంత భయంకరం?

అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన సంప్రదాయ పేలుడు ఆయుధాల్లో ఒకటైన జీబీయూ-43/బీ మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబ్‌ (MOAB)ను ప్రపంచం ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా పిలుస్తోంది. సుమారు 8.5 టన్నుల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లగల ఈ బాంబు మొత్తం బరువు దాదాపు 9.8 టన్నులు. దీని పొడవు తొమ్మిది మీటర్లకు పైగానే ఉంటుంది. సాధారణ బాంబుల మాదిరిగా నేలను తాకిన తర్వాత పేలడం కాకుండా.. భూమికి కొద్ది మీటర్ల ఎత్తులోనే పేలేలా దీనిని రూపొందించారు. ఆ సమయంలో వెలువడే తీవ్ర పేలుడు ప్రభావం చుట్టుపక్కల భవనాలు, సైనిక పరికరాలు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయగలదు. సుమారు కిలోమీటరు పరిధిలోని ఉపరితల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం దీనికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌లోని పికాక్స్‌ మౌంటెన్‌ వంటి పర్వత ప్రాంతాల్లో లోతుగా నిర్మించిన అణు కేంద్రాలపై ఈ బాంబు ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్థకమే. భారీ రవాణా విమానాల ద్వారా మాత్రమే దీనిని ప్రయోగించాల్సి రావడం, ఇరాన్‌ భౌగోళిక పరిస్థితులు కూడా అమెరికాకు సవాళ్లుగా మారవచ్చని సైనిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో అణు విధ్వంసంపై హెచ్చరికలు

ఇరాన్‌పై అణ్వాయుధ ప్రయోగాన్ని ట్రంప్‌ గతంలో ఎప్పుడూ స్పష్టంగా ప్రకటించకపోయినా.. అలాంటి చర్యకు దిగబోనని కూడా చెప్పలేదు. దీంతో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభ దశలో అణు దాడులపై తీవ్ర చర్చ జరిగింది. హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆంక్షలు విధించిన సమయంలో ట్రంప్‌ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. ఇరాన్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించి, జలసంధిని తిరిగి తెరవకపోతే ఓ నాగరికతే అంతమవుతుందన్న అర్థం వచ్చేలా ఆయన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు. విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుని భారీ బాంబుదాడులు చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను పలువురు విశ్లేషకులు తీవ్ర విధ్వంసానికి సంకేతాలుగా భావించారు. అనంతరం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోనూ ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయగలమన్న ధోరణిలో ట్రంప్‌ మాట్లాడారు. ఇప్పుడు అణ్వాయుధ ప్రయోగం ఉండబోదని చెప్పడం కొంత ఊరటనిచ్చినా.. సంప్రదాయ ఆయుధాలతో భారీ దాడులు జరిగే అవకాశాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.

వ్యూహాత్మక అణ్వాయుధాలూ ప్రమాదకరమే!

యుద్ధభూమిలో పరిమిత లక్ష్యాలపై ప్రయోగించేందుకు రూపొందించిన చిన్న సామర్థ్యపు అణ్వాయుధాలను ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌’గా పిలుస్తారు. అయితే, ఇవి చిన్నవని వాటి విధ్వంసకర ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి పేలుడు సామర్థ్యం సుమారు 0.3 నుంచి 50 కిలోటన్నుల వరకు ఉండవచ్చు. హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం 15 కిలోటన్నులు. ఈ పోలికే వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల వద్ద ఈ తరహా ఆయుధాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు యుద్ధంలో వీటిని ఏ దేశమూ ప్రయోగించలేదు.

మరోసారి భీకర దాడులు తప్పవా?

ఇరాన్‌ అణు కేంద్రాలు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి విస్తృత స్థాయిలో వైమానిక దాడులకు దిగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పికాక్స్‌ మౌంటెన్‌ కేంద్రంతోపాటు కీలక సైనిక స్థావరాలపై దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్‌ నౌకాశ్రయాలపై నావికా దిగ్బంధనాన్ని కొనసాగించడం, హోర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం వంటి చర్యలకూ అమెరికా పూనుకోవచ్చు. దీనికి ప్రతిగా గల్ఫ్‌ ప్రాంతంలోని పొరుగు దేశాల చమురు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ హెచ్చరించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా భూతల దళాలను ఇరాన్‌లోకి పంపే అవకాశంపై ట్రంప్‌ మాత్రం వెనక్కి తగ్గారు. ‘‘అలా జరుగుతుందని నేను భావించడం లేదు’’ అని పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌ భూభాగంలోకి సైనికులను పంపే అవకాశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పర్వత ప్రాంతాలతో కూడిన ఇరాన్‌లో భూతల యుద్ధం అమెరికా సైనికులకు తీవ్ర నష్టం కలిగించవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. గతంలో ఇరాన్‌ వద్ద ఉన్నట్లు అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న అత్యంత సుసంపన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక చర్యలపై కూడా చర్చ జరిగింది. అయితే, ఆ దిశగా ఇప్పటివరకు స్పష్టమైన పరిణామం కనిపించలేదు.

యుద్ధానికి ముగింపు ఎప్పుడు?

యుద్ధం బలప్రయోగం ద్వారానైనా, దౌత్య చర్చల ద్వారానైనా త్వరలోనే ముగుస్తుందని ట్రంప్‌ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే, మరోవైపు కొత్త దాడుల అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చకపోవడం పరిస్థితిలోని అనిశ్చితిని స్పష్టం చేస్తోంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాత యుద్ధంలో మరో కీలక దశ ప్రారంభమవుతుందన్న అంచనాలూ వెలువడుతున్నాయి. అయితే, ఎన్నికల తర్వాతే దాడులు జరుగుతాయని ట్రంప్‌ అధికారికంగా ప్రకటించలేదు.

అణుబాంబు ప్రయోగం ఉండదన్న ప్రకటనతో అణు యుద్ధ భయాలకు కొంత తెరపడినప్పటికీ.. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ వినియోగంపై స్పష్టత రాకపోవడం కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న అమెరికా లక్ష్యం.. పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందా? లేక దౌత్య పరిష్కారానికి దారి తీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందున్న కీలక ప్రశ్న.