Trump Midterm Election Defeat – Donald Trump – US Midterm Elections 2026 : ట్రంప్‌కు ఓటుతో షాకిచ్చిన అమెరికా జనం
Trump Midterm Election Defeat – Donald Trump – US Midterm Elections 2026 : ట్రంప్‌కు ఓటుతో షాకిచ్చిన అమెరికా జనం
- అమెరికాలో ట్రంప్ విధానాలపై ప్రజాగ్రహం.. మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ
- రెండు సభలూ డెమోక్రాట్ల వశం
- రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ బీటలు
- ఇరాన్ యుద్ధం.. ధరల సెగతో ఓటర్ల ఆగ్రహం
- ట్రంప్ బలపరిచిన అభ్యర్థులకూ పరాజయం
- వైట్‌హౌస్ నిర్ణయాలకు కాంగ్రెస్ నుంచి అడ్డంకులు!
Trump Midterm Election Defeat – Donald Trump – US Midterm Elections 2026 : ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి: ప్రపంచ దేశాలపై తనదైన దూకుడు వైఖరితో ఒత్తిడి తెస్తూ.. అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆయనకు.. స్వదేశీ ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో షాక్ ఇచ్చారు. తన విధానాలే తన పార్టీకి ప్రతికూలంగా మారడంతో అధికార పక్షం రెండు సభల్లోనూ పట్టు కోల్పోయింది. ఇరాన్‌తో యుద్ధం, ఆకాశాన్నంటిన ధరలు, పెరిగిన జీవన వ్యయం.. వెరసి ట్రంప్ పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిఫలించింది. రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు పాగా వేశారు. చివరకు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసిన అభ్యర్థులూ ఓటమి పాలయ్యారు. రెండేళ్ల పాలనకే ఎదురైన ఈ రాజకీయ పరిణామం ట్రంప్ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. ఇకపై ఆయన ప్రతి కీలక నిర్ణయానికీ కాంగ్రెస్‌లో ప్రతిపక్షం నుంచి అడ్డంకులు తప్పని పరిస్థితి నెలకొంది.
ట్రంప్ విధానాలపై ప్రజా తీర్పు!
మధ్యంతర ఎన్నికలు ట్రంప్ పాలనకు ప్రజాభిప్రాయ సేకరణగా మారాయి. డెమోక్రాట్లు అవినీతి, ఆర్థిక భారం, ధరల పెరుగుదలను ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకున్నారు. ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు, ఇరాన్‌తో యుద్ధం కారణంగా సామాన్యుల జీవన వ్యయం పెరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరోవైపు ట్రంప్ సాంస్కృతిక అంశాలను తెరపైకి తెచ్చి డెమోక్రాట్లను ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లు మాత్రం తమ ఆర్థిక ఇబ్బందులకే ప్రాధాన్యమిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,700 కౌంటీల్లో నమోదైన ఓటింగ్ సరళిలోనూ డెమోక్రాట్లకు అనుకూల మార్పు కనిపించింది. ముఖ్యంగా లాటినో ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కంచుకోటల్లోనూ కమల వికాసం!
రిపబ్లికన్లకు అత్యంత బలమైన రాష్ట్రంగా పేరున్న టెక్సాస్‌లో డెమోక్రాట్లు సంచలన విజయాలు సాధించారు. సెనేట్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు, మూడుసార్లు గవర్నర్‌గా పనిచేసిన గ్రెగ్ అబాట్‌ను ఓడించారు. గినా హినోజోసా టెక్సాస్ తొలి లాటినా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
కాన్సాస్‌లో దాదాపు వందేళ్ల తర్వాత డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 2024లో ట్రంప్‌కు దాదాపు 18 శాతం పాయింట్ల ఆధిక్యం ఇచ్చిన దక్షిణ కరోలినాలోనూ ఆయన మద్దతిచ్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. మైనేలో రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి తెరపడింది. హౌస్ ఎన్నికల్లోనూ పోటీ తీవ్రంగా ఉన్న 20 స్థానాల్లోనూ డెమోక్రాట్లే విజయం సాధించారు.
ట్రంప్ రాజకీయ వ్యూహాలకు దెబ్బ!
ఈ ఎన్నికలను ట్రంప్ వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా తీసుకున్నారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రచార సభల్లో పదేపదే తనను కూడా బ్యాలెట్‌పై ఉన్న అభ్యర్థిగా భావించి ఓటు వేయాలని కోరారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లోనూ జోక్యం చేసుకుని తనకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. టెక్సాస్‌లో కెన్ పాక్స్‌టన్‌కు, దక్షిణ కరోలినాలో డార్లీన్ గ్రాహమ్‌కు మద్దతిచ్చారు. అయితే ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ట్రంప్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించిన రిపబ్లికన్ అభ్యర్థులకూ ఓటమి తప్పలేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆయన అనుసరించిన వ్యూహాలు ఆశించిన ఫలితాలనివ్వలేదని స్పష్టమైంది.
సెనేట్‌లో తొలి ముస్లిం సభ్యుడు
మిచిగాన్ సెనేట్ స్థానంలో డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ విజయం సాధించారు. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లింగా ఆయన చరిత్ర సృష్టించారు. ట్రంప్ మద్దతున్న మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ మైక్ రోజర్స్‌ను ఓడించారు. మరోవైపు జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్ విజయం సాధించి అమెరికా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. ఫ్లోరిడాలో బైరన్ డొనాల్డ్స్ తొలి నల్లజాతి రిపబ్లికన్ గవర్నర్‌గా నిలిచారు.
ట్రంప్‌పై అసంతృప్తి.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ స్పష్టం!
ఎన్నికల అనంతరం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ట్రంప్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మరింత స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా సగం మంది ఓటర్లు ఈ ఎన్నికలను ట్రంప్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశంగా భావించినట్లు వెల్లడైంది. దేశం వెళ్తున్న దిశపై 75 శాతం మంది ఆగ్రహం లేదా అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. అధ్యక్షుడి అధికారాలపై కాంగ్రెస్ మరింత నియంత్రణ, సమతుల్యత పాటించాలని 70 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాలు ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ట్రంప్ అజెండాకు డెమోక్రాట్ల అడ్డుకట్ట!
రెండు సభలూ డెమోక్రాట్ల చేతుల్లోకి వెళ్లడంతో ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో కొత్త సభ్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం, ఆయన కుటుంబం, సన్నిహితుల వ్యవహారాలపై విచారణలు చేపట్టే అవకాశం ఉంది. కీలక బిల్లుల ఆమోదానికి డెమోక్రాట్ల మద్దతు అవసరమవుతుంది. సెనేట్‌లో ఆధిపత్యం కారణంగా ట్రంప్ ప్రతిపాదించే ఉన్నతస్థాయి నియామకాలను, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను సైతం అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల మద్దతుతో ముందుకు సాగిన ట్రంప్ అజెండాకు ఇకపై ప్రతిపక్షం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకానుంది.
ఓటమిని అంగీకరించినా.. తగ్గని ట్రంప్!
ఎన్నికల ఫలితాలపై ట్రంప్ స్పందిస్తూ డెమోక్రాట్లకు అభినందనలు తెలిపారు. వలసల వంటి అంశాల్లో వారితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. అయితే డెమోక్రాట్లు తీసుకొచ్చే అసంబద్ధమైన బిల్లులను వీటో చేస్తానని హెచ్చరించారు. ఇరాన్‌తో యుద్ధం తమ పార్టీ ఓటమికి ఒక కారణమని అంగీకరించినప్పటికీ, యుద్ధానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని మాత్రం సమర్థించుకున్నారు. మరోవైపు తాను కూడా బ్యాలెట్‌పై ఉండి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాడినని సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు.
2028కు ముందే ట్రంప్‌కు రాజకీయ పరీక్ష!
రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేని ట్రంప్‌కు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక పరిణామంగా మారాయి. 2028 అధ్యక్ష ఎన్నికలపై ఇప్పటి నుంచే చర్చ మొదలవుతున్న వేళ.. రిపబ్లికన్ పార్టీలో తదుపరి నాయకత్వం కోసం పోటీకి ఈ పరిణామాలు ఊతమివ్వవచ్చు. మరోవైపు డెమోక్రాట్లు రెండు సభల్లో సాధించిన ఆధిపత్యాన్ని ఎలా వినియోగించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు.. ఇకపై స్వదేశంలోనే కాంగ్రెస్ రూపంలో మరో రాజకీయ సవాలు ఎదురుకానుంది.
