Trump-Blames-Ukraine-Democrats : అంతా వీళ్ల వ‌ల్లే,,! Andhra Prabha Top News

Trump-Blames-Ukraine-Democrats : అంతా వీళ్ల వ‌ల్లే,,! Andhra Prabha Top News

  • ఉక్రెయిన్,, డెమోక్రాట్లే, కార‌ణం
  • ఇరాన్ యుద్ధం కాదు.. హోర్ముజ్‌ కాదు
  • రిఫైనరీలే సమస్య
  • పెట్రోల్ ధ‌రల‌ మంటపై ట్రంప్‌ ఎదురుదాడి

( వాషింగ్టన్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి)

అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కొత్త రాజకీయ తలనొప్పిగా మారుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పెట్రోల్‌ ధరల పెరుగుదలకు తన ప్రభుత్వ విధానాలు కారణమన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం, హోర్ముజ్‌ జలసంధి సంక్షోభం కంటే రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు, డెమోక్రాట్ల పాలనలోని రాష్ట్రాల్లో రిఫైనరీల మూసివేతలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఆరోపించారు.

ట్రంప్ త‌న‌ ‘ట్రూత్‌ సోషల్‌’లో చేసిన పోస్టులో.. హోర్ముజ్‌ సమస్య ఇప్పుడు ప్రధాన కారణం కాదని పేర్కొన్నారు. భారీ స్థాయిలో చమురు బయటకు వస్తోందని, అసలు సమస్య రిఫైనరీలేనని అన్నారు. రష్యా రిఫైనరీలను ఉక్రెయిన్‌ ధ్వంసం చేస్తోందని.. అమెరికాలోని కాలిఫోర్నియా వంటి డెమోక్రటిక్‌ పాలిత రాష్ట్రాల్లో రిఫైనరీలు మూతపడుతున్నాయని విమర్శించారు.

హోర్ముజ్‌ సరఫరా.. 97 శాతం పతనం

అయితే నిపుణుల గణాంకాలు మరో చిత్రాన్ని చూపుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హోర్ముజ్‌ జలసంధి మీదుగా రోజువారీ చమురు ఎగుమతులు 97 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ప్రపంచ చమురు సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో వినియోగదారులపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. అమెరికన్‌ ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ (AAA) గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఒక గ్యాలన్‌ (3.79 లీటర్లు) పెట్రోల్‌ సగటు ధర 4.36 డాలర్లకు చేరింది. నెల క్రితం ఇది 4.14 డాలర్లు మాత్రమే. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన సమయంలో గ్యాలన్‌ ధర 2.98 డాలర్లుగా ఉంది.

‘మధ్యప్రాచ్య సరఫరా ఇంకా సాధారణ స్థాయికి రాలేదు’

అమెరికా, రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణలు పరస్పరం ప్రభావం చూపుతూ చమురు ఉత్పత్తుల మార్కెట్లను మరింత అస్థిరం చేస్తున్నాయని సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ నిపుణురాలు రేచల్‌ జియెంబా తెలిపారు.మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరా ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదని ఆమె పేర్కొన్నారు. రష్యా రిఫైనరీలపై దాడులు, రష్యా చమురును శుద్ధి చేసే సంస్థలపై మరిన్ని అమెరికా ఆంక్షలు విధించే అవకాశాలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యం నుంచి అస్థిరంగా వస్తున్న చమురు సరఫరానేనని వివరించారు.

అత్యవసర నిల్వల నుంచి చమురు విడుదల

ఇంధన ధరల ఒత్తిడిని తగ్గించేందుకు జీ7 దేశాలు కూడా చర్యలకు దిగాయి. శుక్రవారం అత్యవసర నిల్వల నుంచి 10 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను విడుదల చేయాలని నిర్ణయించాయి. మరోవైపు అమెరికా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కూడా 1982 తర్వాత ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.అమెరికా ఒత్తిడితో కొన్ని యూరోపియన్‌ దేశాలు తమ వ్యూహాత్మక ఇంధన నిల్వలను విడుదల చేసేందుకు ముందుకొచ్చాయని గ్యాస్‌బడ్డీ పెట్రోలియం విశ్లేషణ విభాగం అధిపతి పాట్రిక్‌ డిహాన్‌ తెలిపారు. దీనివల్ల చమురు, పెట్రోల్‌, డీజిల్‌ ఫ్యూచర్స్‌ ధరలు కొంత తగ్గినట్లు పేర్కొన్నారు.

రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు

ఇదిలా ఉండగా రష్యా ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్‌ దాడులు కూడా అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా డీజిల్‌ ధరలపై ఒత్తిడి పెరిగింది. రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో సగానికి పైగా దెబ్బతీసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో రష్యా రిఫైనరీల ఉత్పత్తి రెండు దశాబ్దాల్లోనే అత్యల్ప స్థాయికి పడిపోయింది. గత 18 నెలల్లో డీజిల్‌ ఉత్పత్తి కూడా 30 శాతం తగ్గింది.

కాలిఫోర్నియాపైనా ట్రంప్‌ విమర్శలు

అమెరికాలో రిఫైనరీల మూసివేతలపైనా ట్రంప్‌ దృష్టి సారించారు. ముఖ్యంగా డెమోక్రటిక్‌ పార్టీ పాలిత కాలిఫోర్నియాలో గత ఏడాది రెండు రిఫైనరీలు మూతపడ్డాయని ఆయన ఆరోపించారు. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ విశ్లేషణ ప్రకారం.. ఆ రెండు రిఫైనరీల మూసివేతతో కాలిఫోర్నియా చమురు శుద్ధి సామర్థ్యం 17 శాతం తగ్గింది. దీంతో స్థానికంగా ఇంధన సరఫరాలో కొంత లోటు ఏర్పడింది.
అమెరికా ఇంధన ధరల పెరుగుదలకు కేవలం దేశీయ రిఫైనరీల సమస్యను మాత్రమే కారణంగా చూపడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రాచ్య సరఫరాలో ఏర్పడిన భారీ అంతరాయం, చమురు ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తరలించడంలో పెరిగిన ఇబ్బందులు కూడా కీలకంగా మారాయి.

ఎన్నికల ముందు ట్రంప్‌కు పెట్రోల్‌ పరీక్ష

ఇంధన ధరలపై ట్రంప్‌ చేస్తున్న రాజకీయ ఎదురుదాడికి మరో కారణం ఉంది. అమెరికా మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఎన్నికలు వాషింగ్టన్‌లో అధికార సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరలకు అధ్యక్షుడి విధానాలే కారణమని ప్రజల్లో అభిప్రాయం బలపడితే.. అది రిపబ్లికన్లకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశముంది.ఇటీవలి ఏపీ-నార్క్‌ సర్వేలో 65 శాతం మంది అమెరికన్లు పెరుగుతున్న ధరలకు ట్రంప్‌ విధానాలే కారణమని అభిప్రాయపడ్డారు. మరో 61 శాతం మంది.. ట్రంప్‌ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి కంటే ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు.దీంతో పెట్రోల్‌ ధరల మంట కేవలం ఆర్థిక సమస్యగానే కాకుండా.. మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌ రాజకీయ భవితవ్యాన్ని ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. హోర్ముజ్‌ నుంచి రష్యా రిఫైనరీల దాకా చమురు సంక్షోభానికి కారణాలపై అమెరికాలో రాజకీయ దుమారం రేగుతోంది.