Donald Trump: వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్..
ఓటర్లను ఆకట్టుకునేలా భారీ హామీల వర్షం!
Donald Trump: అమెరికాలో త్వరలో జరగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికల సమరంలో గెలుపే లక్ష్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వయోవృద్ధులను ఆకట్టుకునేందుకు ఆయన సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు.
వృద్ధులకు మెడికేర్ ప్రీమియం భారం తగ్గింపు..
సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, వృద్ధులకు ఆరోగ్య ఇన్సూరెన్స్ భారము తగ్గించేందుకు ప్రభుత్వం నుంచి ఊరట కలిగించనున్నారు. మెడికేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఒక్కొక్కరికీ 90 డాలర్ల చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే అమెరికాలోని సుమారు 20 మిలియన్ల మంది వృద్ధులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
వరుస ఉచిత హామీలతో చెక్కులు, నగదు బదిలీ..
గతంలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో కూడా అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ప్రీమియం ఉపశమనం కింద ఓటర్లకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు అందిస్తామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా, తమ రిపబ్లికన్ పార్టీని విజయం దిశగా నడిపిస్తే ప్రతీ వయోజన అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్ల చొప్పున నగదు ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలుకు ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల భారీ నిధులు కావాలని, చట్టసభల ఆమోదం పొందడం అంత సులువు కాదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తగ్గుతున్న ప్రజాదరణను అధిగమించేందుకేనా..?
అమెరికాలో ఇటీవల నిర్వహించిన పలు సర్వేలలో ట్రంప్ ప్రజాదరణ క్రమంగా తగ్గుతున్నట్లు వెల్లడైంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి ఆయన నిర్ణయాలే ప్రధాన కారణమని అత్యధిక శాతం ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు కేవలం 17 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. అయితే, ఈ ద్రవ్యోల్బణ విమర్శలను కొట్టిపారేసిన ట్రంప్, అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా దూసుకుపోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ఆయన ఈ తరహా భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
