trs| టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు!
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు!
- హైకోర్టు ఆదేశాలనూ లెక్కచేయరా?
- అయ్యప్ప సొసైటీలో 700 అక్రమ భవనాలు!..
- సీఎం ఏం చేస్తున్నారు?
- కాంగ్రెస్ నడిపేది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?
- పేదల ఇళ్లు కూల్చేస్తారు.. బడాబాబుల భవనాలు వదిలేస్తారా?
- ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి అక్రమ పర్మిషన్లు ఇప్పిస్తున్నారు!
- మూసీ గర్భంలో కొత్త ప్రాజెక్టులు.. ఎవరి అండతో నిర్మాణాలు?
- ఆర్టీఐలో 18 వేల దరఖాస్తులు పెండింగ్.. ఇదేం పాలన?
- అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు ఆపండి.. సీఎంకు కవిత డిమాండ్
- అక్రమ నిర్మాణాల వెనుక ప్రభుత్వ పెద్దలు..
హైదరాబాద్, నవంబర్ 5, ఆంధ్రప్రభ: తెలంగాణలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం అమలు తీరుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటికి కేవలం రెండు అడుగుల దూరంలోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
500 నుంచి 700 అక్రమ భవనాలు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. సర్వే నంబర్లు 11, 18 నుంచి 44 వరకు వరుసగా నిర్మాణాలు చేపడుతున్నారని, మొత్తం 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. సర్వే నంబర్ 12లో ఏకంగా 12 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఎలా లభిస్తున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు
అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల వెనుక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి నిర్మాణాలకు అనుమతులు ఇప్పిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే ఇంత పెద్దఎత్తున అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ నడుపుతున్నది ప్రభుత్వమా? రౌడీ రాజ్యమా?’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
మీడియాను బెదిరిస్తున్నారంటూ..
అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలపై ఓ వార్తాపత్రిక గూగుల్ మ్యాప్ ఆధారాలతో సహా కథనం ప్రచురించిందని కవిత తెలిపారు. అయితే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియా ప్రతినిధులను అక్కడి నిర్మాణాల యజమానులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ వెనుక ప్రభుత్వం ఉందంటూ మీడియా వారిని భయపెడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై వార్తలు రాసే మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని పరోక్షంగా ప్రభుత్వాన్ని కోరారు.
పేదల ఇళ్ల కూల్చివేతలు.. పెద్దల నిర్మాణాలపై మౌనం ఎందుకు?
మంథని నియోజకవర్గంలోని శాత్రాజుపల్లి గ్రామంలో బొగ్గు గని ఏర్పాటు కోసం కనీసం సర్వే కూడా నిర్వహించకముందే అర్ధరాత్రి సమయంలో 374 ఇళ్లను కూల్చివేశారని కవిత ఆరోపించారు. పేదల ఇళ్ల విషయంలో మాత్రం వేగంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, హైదరాబాద్‌లో పెద్దఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న ఆమె, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్టీఐలో 18 వేల దరఖాస్తులు పెండింగ్!
రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలు తీరు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కవిత విమర్శించారు. ఆర్టీఐ కింద సమాచారం కోరుతున్నప్పటికీ అధికారులు సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
పెండింగ్ దరఖాస్తులపై ఒత్తిడి పెరగడంతో ఒకే జిల్లాలో 800 దరఖాస్తులకు ఒకరోజులో సమాధానం ఇవ్వలేమంటూ అధికారులు చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాచార హక్కు చట్టం ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీలోని నిర్మాణాలకు సంబంధించిన తాను అడిగిన సమాచారాన్ని అధికారులు తప్పనిసరిగా అందించాలని డిమాండ్ చేశారు.
మూసీ పరివాహకంలోనూ అక్రమ ప్రాజెక్టులా?
మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మాణాలపైనా కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసీ నది గర్భంలో నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ గతంలో తాము అక్కడ ధర్నా నిర్వహించినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో మరో మూడు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు.
ఆదిత్య బిల్డర్స్ యజమాని ముఖ్యమంత్రి సోదరులకు విల్లా ఇవ్వడంతోనే నిర్మాణాలకు అనుమతులు లభించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమిత్‌షా పర్యటనపైనా విమర్శలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనపైనా కవిత విమర్శలు చేశారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని అమిత్‌షా చెబుతున్నారని, అలాంటప్పుడు గతంలో జరిగిన ఎన్నికల్లో విదేశీయుల ఓట్లతోనే గెలిచారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 320 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్రం నుంచి సహాయం అందుతుందని ఆశించామని పేర్కొన్నారు. అయితే తెలంగాణకు ఆర్థిక సాయం ప్రకటించకుండా, కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేసిందనే కారణంతో హైదరాబాద్‌లో ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ స్పందనపై ఆసక్తి
అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలు, మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు, ఆర్టీఐ దరఖాస్తుల పెండింగ్, పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇలా పలు అంశాలను ప్రస్తావిస్తూ కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
