kavitha |స్వచ్ఛ ఆటోలపై సీఎం స్పష్టత ఇవ్వాలి
టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్
చెత్త సేకరణ రుసుము వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దు.. ప్రస్తుత స్వచ్ఛ ఆటోలతోనే సేవలు కొనసాగించాలి
స్పష్టత ఇవ్వకుంటే 40 వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం: టీఆర్‌ఎస్ అధినేత్రి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆటోల ద్వారా కొనసాగుతున్న చెత్త సేకరణ వ్యవస్థపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లులతో పాటు ఇతర బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. స్వచ్ఛ ఆటో కార్మికుల భవిష్యత్తుపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని కోరారు.
ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటు చెత్త సేకరణకు రుసుము వసూలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా చెత్త సేకరణకు సంబంధించిన రుసుము విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
కార్పొరేట్ సంస్థలకు అప్పగించొద్దు
చెత్త సేకరణ బాధ్యతలను పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కవిత కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ కొనసాగుతుందని సీఎం హామీ ఇవ్వాలని అన్నారు. స్వచ్ఛ ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ వ్యవస్థలో మార్పుల పేరుతో వారి ఉపాధికి గండికొట్టే చర్యలు చేపట్టొద్దని కోరారు.
‘40 వేల మందితో ఉద్యమిస్తాం’
స్వచ్ఛ ఆటోలు, చెత్త సేకరణ రుసుముపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టత ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కవిత హెచ్చరించారు. సుమారు 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులతో కలిసి ఆందోళనకు దిగుతామని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా చెత్త సేకరణ విధానాన్ని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరిని స్పష్టం చేసి, కార్మికుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని కవిత కోరారు.
