కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు..
టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భుజంగరావు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాన్సువాడకు చెందిన అనిల్‌ అనే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భుజంగరావు ఎస్సైకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కానిస్టేబుల్‌ అనిల్‌ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉండి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిపై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని భుజంగరావు అన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాజేందర్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.