trs| ఇదేనా మీ ప్రజా పాలన? : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

trs| ఇదేనా మీ ప్రజా పాలన? : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

  • అనంతరం భూపాలపల్లి ఆసుపత్రిలో SNCU సీలింగ్‌ కూలిందన్న కవిత
  • ఆదిలాబాద్‌ RIMS ఘటన మరవకముందే మరో ఘటన..
  • ప్రభుత్వ వైద్యంపై తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి ప్రశ్నలు
  • ‘ఆపరేషన్‌ బ్లూకోడ్‌’తో ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన చేపడతామని వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలపై తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ RIMSలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనపై ఇప్పటికే విచారణ, భద్రతా ఆడిట్‌ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో SNCU వార్డులో సీలింగ్‌ కూలిందని ఆమె పేర్కొన్నారు.

‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా?’

భూపాలపల్లి ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా ప్రజా పాలన అంటూ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ RIMS ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషాదం మరవకముందే మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ఆమె పేర్కొన్నారు. అయితే భూపాలపల్లి ఘటనలో సీలింగ్‌ కూలిన సమయంలో వార్డులో చిన్నారులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని తెలిపారు.

RIMS ఘటనపై ఇప్పటికే విచారణ

ఆదిలాబాద్‌ RIMSలో సెప్టెంబర్‌ 21న SNCUలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక దర్యాప్తులో ఎయిర్‌ కండిషనింగ్‌ యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రమాదం అనంతరం 27 మంది నవజాత శిశువులను అక్కడి నుంచి తరలించగా.. అనంతరం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోపాటు విద్యుత్‌, అగ్నిమాపక, భవన భద్రతపై ఆడిట్లు చేపట్టాలని నిర్ణయించింది.

తాజాగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR) బృందం కూడా RIMSను సందర్శించి SNCUతోపాటు ఇతర విభాగాలను పరిశీలించింది. వైద్యులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి, ఘటనకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించింది.

ఆసుపత్రుల నిర్వహణపై ప్రశ్నలు

ప్రభుత్వం వైద్య రంగానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, మందుల లభ్యత, వైద్యులు, పడకల కొరత వంటి సమస్యలు ఉన్నాయని కవిత ఆరోపించారు. కొన్ని ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, సిబ్బంది కొరత, నిర్వహణ అంశాలపై వైద్య సంఘాలు కూడా ఇటీవల ఆందోళనలు వ్యక్తం చేశాయి. RIMS ఘటన నేపథ్యంలో ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని, కీలక విభాగాలకు ప్రత్యేక నిర్వహణ నిధులు కేటాయించాలని వైద్య సంఘాలు కోరినట్లు నివేదికలు వెలువడ్డాయి.

‘ఆపరేషన్‌ బ్లూకోడ్‌’తో పరిశీలనలు

ప్రభుత్వ ఆసుపత్రుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్‌ బ్లూకోడ్‌’ పేరుతో తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తారని కవిత ప్రకటించారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, వైద్య సిబ్బంది, మందుల లభ్యత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి.. తమ దృష్టికి వచ్చిన అంశాలను ప్రజాక్షేత్రంలో వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

కాగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై తాజాగా చర్చకు దారితీసిన ఆదిలాబాద్‌ RIMS ఘటనపై ఇప్పటికే వివిధ స్థాయిల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి SNCU ఘటనపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.