రజత పతకంతో మెరిసిన ట్రిపుల్ ఐటీ క్రీడాకారిణులు
ఎచ్చెర్ల(శ్రీకాకుళం),ఆంధ్రప్రభ: రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటి రజత పతకం సాధించిన ఎచ్చెర్ల ఆర్‌జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ గిరిధర్ మద్రాస్ అభినందించారు.ఆగస్టు 27న నిర్వహించిన మహిళల అండర్-23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన ఆరుగురు విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్యభూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయిల నగదు బహుమతిని అందుకున్నారు.
సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విజేతలతో పాటు సహకరించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రతినిధులు టి.దిలీప్ కుమార్, కృష్ణంరాజులను డైరెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, అకడమిక్ డీన్ శివరామశాస్, వెల్ఫేర్ డీన్లు ప్రకాష్ రావు, యోగేశ్వరి పాల్గొన్నారు.
