మౌంట్ ఎలబ్రోస్‌పై త్రివర్ణ పతాకం.. ఏలూరు ఎస్‌ఐకు అరుదైన గౌరవం

ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: రష్యాలోని యూరప్ ఖండంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎలబ్రోస్ శిఖరాన్ని అధిరోహించి, అక్కడ భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన ఏలూరు రూరల్ ఎస్‌ఐ వేముల వెంకటేశ్వరరావుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆయనను అభినందించారు. 2012లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరిన వేముల వెంకటేశ్వరరావు అత్తిలి, నల్లజర్ల, పాలకోడేరు, భీమవరం వన్‌టౌన్, గణపవరం, కలిదిండి పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా సేవలందిస్తున్నారు.

పర్వతారోహణపై ఆసక్తితో ప్రత్యేక శిక్షణ..

పర్వతారోహణపై ఆసక్తితో వెంకటేశ్వరరావు తెలంగాణలోని భువనగిరి ట్రాన్సెంట్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శిక్షణ పొందారు. లేహ్-లడఖ్‌లో ఇంటర్మీడియట్ ఎక్స్‌పెడిషన్ శిక్షణతో పాటు డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు.

100 మీటర్ల జాతీయ పతాకంతో రికార్డు..

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎలబ్రోస్ శిఖరాన్ని వెంకటేశ్వరరావు విజయవంతంగా అధిరోహించారు. అక్కడ 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గతంలో నమోదైన 78 మీటర్ల రికార్డును అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదైంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ లోగోతో పాటు డీజీపీ, జిల్లా ఎస్పీ చిత్రాలను ప్రదర్శించి రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో చాటారు.

ఎవరెస్టు అధిరోహించాలని ఎస్పీ ఆకాంక్ష..

విదేశాల్లో దేశ ఖ్యాతితో పాటు రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఐ సాధించిన ఘనత పోలీసు శాఖలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్‌ఐను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై. ప్రసాద్‌రావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగబాబు, ఎస్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.