సచివాలయం వద్ద విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళి

రాజీవ్‌ సేవలను స్మరించుకున్న ప్రభుత్వ సలహాదారు, ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాంధీ 82వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, ఫిషరీస్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, రాపోలు జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రధానిగా రాజీవ్‌ గాంధీ అందించిన సేవలను, ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వారు స్మరించుకున్నారు. ముఖ్యంగా సమాచార సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్‌ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రగతికి పునాదులు వేశాయని పేర్కొన్నారు. రాజీవ్‌ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.