Tribute | ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి

Tribute | ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి

Tribute | విజయవాడ, ఆంధ్రప్రభః ప్రముఖ బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆదివారం విజయవాడ దుర్గాపురంలోని ఐలాపురం నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి రామకృష్ణ, ఈశ్వరయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకయ్య కుమారుడు ఐలాపురం రాజాతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఐలాపురం వెంకయ్య కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు కొనసాగుతూ రెండు విడతలుగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించినట్లు వారు గుర్తుచేశారు. ఆయన ఎప్పుడూ అనగారిన వర్గాల సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేస్తూ ప్రజల మధ్యే ఉండేవారని వివరించారు. ప్రత్యేకంగా బీసీ వర్గాల సంక్షేమం కోసం శాసన మండలిలో బలమైన స్వరం వినిపిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు.

సమస్యలు పరిష్కారమయ్యే వరకు పట్టుదలతో పోరాడిన ప్రజానాయకుడిగా ఆయన నిలిచారని తెలిపారు. అన్ని పార్టీల నేతలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని, అమలాపురం మరణం అనగారిన వర్గాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. వెంకయ్య సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నేటి తరం రాజకీయాలకు ఆయన ఆశయాలు, సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఐలాపురం వెంకయ్యకు నివాళులు అర్పించిన వారిలో సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి తదితరులున్నారు.

Leave a Reply