విద్యుత్ వైర్లపై చెట్లు.. తప్పిన ప్రమాదం!
- గాలివానకు 11 కేవీ విద్యుత్ తీగలపై విరిగిపడ్డ కొమ్మలు
- పాత రాజరాజేశ్వరిపేట–కంసాలిపేట మార్గంలో ఘటన
- స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన విద్యుత్, వీఎంసీ సిబ్బంది
- పేటలో పలుచోట్ల తీగలపై వేలాడుతున్న చెట్ల కొమ్మలు
- గాలివాన వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి
- ప్రమాదాలు జరగకముందే కొమ్మలు తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి
విజయవాడ, ఆంధ్రప్రభ: గాలివాన బీభత్సానికి విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పాత రాజరాజేశ్వరిపేట నుంచి కంసాలిపేటకు వెళ్లే మార్గంలో గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పెద్ద చెట్ల కొమ్మలు విరిగి 11 కేవీ విద్యుత్ తీగలపై పడటంతో అవి తెగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.
విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడిన విషయాన్ని స్థానికులు ధనేకుల సుబ్బారావుకు సమాచారం అందించారు. ఆయన విద్యుత్ శాఖ ఏఈతోపాటు వీఎంసీ పార్క్ విభాగం అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ తీగలపై పడిన చెట్లను, కొమ్మలను తొలగించి మార్గాన్ని క్లియర్ చేశారు.
తీగలపై కొమ్మలు.. ప్రమాదానికి ఆహ్వానం..
పేట పరిధిలో పలుచోట్ల విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు వేలాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గాలివాన వచ్చిన ప్రతిసారీ చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, తీగలు తెగిపోవడం వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను, ప్రమాదకరంగా వేలాడుతున్న కొమ్మలను వీఎంసీ అధికారులు గుర్తించి తక్షణమే తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ తీగలు తెగిపడటం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఘటనలో ధనేకుల హరికృష్ణ, బొందిలి తిలక్, రామ్‌సింగ్, బషీర్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

