ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఏఈ…

ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఏఈ…

ఆరు కొత్త మీటర్ల కోసం లంచం డిమాండ్‌..
మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు


ACB Raid | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నగరంలోని సంతోష్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ శాఖకు చెందిన ఓ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. మాదన్నపేట సెక్షన్‌లో ఏఈగా పనిచేస్తున్న పందాల సంధ్యారాకేష్‌ రూ.1.20 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన విద్యుత్‌ శాఖలో కలకలం రేపింది.

పాత విద్యుత్‌ మీటర్ల స్థానంలో ఆరు కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని ఫిర్యాదుదారుడు ఏఈని కోరినట్లు సమాచారం. ఈ పనికి సంబంధించి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో గురువారం ఏఈ రూ.1.20 లక్షలు లంచంగా తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం సంబంధిత వివరాలను సేకరించి, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.