TRAI |ఇక టెలికాం కంపెనీల ఆటలకు చెక్.. ట్రాయ్ కొత్త నిబంధనలు ఇవే!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మొబైల్ రీచార్జ్ చేసే ప్రతిసారీ వినియోగదారులకు ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. తక్కువ ధరకు లభించే ప్లాన్లు ఎక్కడో దాచేయడం, లేదా 28 రోజుల ప్లాన్లనే నెల ప్లాన్లంటూ అమాయక వినియోగదారులను కన్ఫ్యూజ్ చేయడం పరిపాటిగా మారింది. ఈ తికమకకు చెక్ పెడుతూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) బంపర్ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల జేబుకు కత్తెర పడకుండా, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా టెలికాం ఆపరేటర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
యాప్స్ ఓపెన్ చేయగానే..
వినియోగదారులు రీచార్జ్ చేసుకునేటప్పుడు సదరు ప్లాన్లు ఈజీగా కనిపించేలా వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లలో “TRAI-Mandated Packs” పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదీ కూడా ఏదో మూలన కాకుండా.. రీచార్జ్ పేజీ ఓపెన్ చేయగానే మొదటి ట్యాబ్‌లోనే ఈ కేటగిరీ కనిపించాలే ఉంచాలని సూచించింది. దీనివల్ల తక్కువ ధరకు లభించే రీచార్జ్ ప్యాక్స్ కోసం యాప్ అంతా వెతకాల్సిన అవసరం లేకుండా ఒక్క క్లిక్‌తో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది.
రీచార్జ్ దాగుడుమూతలకు చెక్..
వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదులపై ట్రాయ్ సీరియస్‌గా స్పందించింది. టెలికాం కంపెనీలు చౌకైన ప్లాన్లను వేర్వేరు కేటగిరీల వెనుక దాచిపెడుతున్నాయని, యూజర్లు నాలుగైదు స్క్రీన్లు స్క్రోల్ చేస్తే కానీ అవి కనిపించడం లేదని గుర్తించింది. వినియోగదారులకు అవసరమైన ప్లాన్లను ఎంచుకునే హక్కును కాలరాస్తున్న ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.ఈ కొత్త నిబంధనల్లో భాగంగా ప్రతి టెలికాం ఆపరేటర్ కచ్చితంగా పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది.
సామాన్యుడికి భారీ ఉపశమనం..
వివరాలన్నీ కంటికి ఎదురుగా స్పష్టంగా ప్రదర్శించడం వల్ల ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో రీచార్జ్ చేసుకోవాలనుకునే సామాన్యులకు, సీనియర్ సిటిజన్లకు గొప్ప ప్రయోజనం చేకూరనుంది. టెలికాం కంపెనీలు ఇకపై తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో ఈ మార్పులను తక్షణమే అమలు చేయాల్సి ఉంటుంది.
