విదేశీ గడ్డపై విషాదం.. మృతదేహం కోసం నెలరోజుల నిరీక్షణ !
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తెలంగాణకు చెందిన పలువురు కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లిన కొందరు యువకులు అక్కడి సైనిక విధుల్లోకి తీసుకెళ్లడంతో చిక్కుల్లో పడగా.. మరికొందరు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
ఉక్రెయిన్‌లో రష్యా రాకెట్ దాడిలో జగిత్యాల జిల్లాకు చెందిన అవిలాల సుదర్శన్ (36) మృతి చెందారు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు నెలకు పైగా ఎదురుచూశారు. ఉక్రెయిన్‌లోని ఓ కంపెనీలో కాంక్రీట్ ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేస్తున్న సుదర్శన్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు రూ.6 లక్షలు అవసరమని భారత రాయబార కార్యాలయం కుటుంబానికి తెలిపింది.
సుదర్శన్ భార్య అవిలాల భార్గవి ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు మంజూరు చేశారు.
