మాజీ సర్పంచ్‌ సురవరం వేమారెడ్డి మృతి

  • కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మృతితో ఎల్కతుర్తిలో విషాదం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సురవరం వేమారెడ్డి (83) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో ఎల్కతుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సురవరం వేమారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడిగా, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడిగా గ్రామ ప్రజలకు సుపరిచితులు. కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ తక్కువగా ఉన్న సమయంలోనే పార్టీ సభ్యత్వం స్వీకరించి, పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారు. అనంతరం ఎల్కతుర్తి గ్రామ సర్పంచ్‌గా ఐదేళ్లపాటు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ప్రజలతో మమేకమై, గ్రామ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా వేమారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి, ఎల్కతుర్తి గ్రామానికి తీరని లోటని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

వేమారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి అందించిన సేవలు, ప్రజల కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని వారు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలాన్ని తట్టుకునే శక్తి, మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.