నిలిచిన రాక‌పోక‌లు

నిలిచిన రాక‌పోక‌లు

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో భారీ వ‌ర్షాలు (Khammam heavy rains) కురుస్తున్నాయి. ఈ రో్జు తెల్ల‌వారు జాము నుంచి భారీ వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు నీటితో నిండి ఉండడంతో తాజాగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం క‌లిగింది.

ఖమ్మం జిల్లా (Khammam District) లోని పాలేరు రిజర్వాయర్ కు ఎగువ నుండి భారీగా వరద వస్తుండడంతో 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మం నగరంలో రోడ్లు జలమయం కావడంతో మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. చింతకాని మండలం నాగులవంచ పాతర్లపాడు మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. పాపటపల్లి నుండి వియ్యం బంజర మార్గంలో బుగ్గ వాగు వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తుగా రెండు జిల్లాల్లో కలెక్టర్లు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రెండు జిల్లాల్లో కలెక్టర్లు దిరిశెట్టి అనుదీప్, జితేష్ వి పాటిల్ అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.

భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ- కాజీపేట లైన్‌ల్లో రైళ్ల‌ను నిలిపియడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద రైల్వే లైన్ మీదకు వాన నీరు చేరడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలును డోర్నకల్ లో నిలిపివేశారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ రైలును మహబూబాబాద్ లో నిలిపివేశారు. పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Collector Anudeep Durisetty) కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని కలెక్టర్ సూచించారు.

ఉమ్మ‌డి ఖమ్మం బ్యూరో : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలన్నారు.

Leave a Reply