దసరా రద్దీపై ట్రాఫిక్ పోలీసుల నిఘా..
- ఎంజీబీఎస్, శివాజీ బ్రిడ్జి, సీబీఎస్ ప్రాంతాల్లో తనిఖీలు
- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దసరా సెలవుల నేపథ్యంలో నగరంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ, ప్రజల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్-2 విభాగం అదనపు డీసీపీ కె. వేణుగోపాల్‌రెడ్డి, ఇతర ట్రాఫిక్ అధికారులు ఎంజీబీఎస్, శివాజీ బ్రిడ్జి, సీబీఎస్, శివాజీ రోటరీ ప్రాంతాలను తనిఖీ చేశారు. రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించి, ట్రాఫిక్ సజావుగా సాగేలా అవసరమైన సూచనలు జారీ చేశారు. దసరా సెలవుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, బస్సుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
