ప్రోటోకాల్‌ పేరుతో కొండపైకి కార్ల క్యూ!

  • ఇంద్రకీలాద్రిపై వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ జామ్‌
  • వీఐపీ దర్శనాలకు వ్యక్తిగత కార్లతో తరలివస్తున్న ప్రముఖులు, అనుచరులు
  • ఓం టర్నింగ్‌ నుంచి దిగువ ఘాట్‌ రోడ్డు వరకు వాహనాల బారులు
  • ఘాట్‌ రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్‌
  • ద్విచక్ర వాహనాల అనుమతులపైనా నిబంధనల ఉల్లంఘన
  • పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వాహనాలతోనూ ఇబ్బందులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైన వేళ.. కొండపై వాహనాల రద్దీ భక్తులకు, విధుల నిర్వహణకు ఇబ్బందులు సృష్టిస్తోంది. ప్రోటోకాల్‌, వీఐపీ దర్శనాల పేరుతో వ్యక్తిగత కార్లను సైతం కొండపైకి అనుమతిస్తుండటంతో ఘాట్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వ్యక్తిగత వాహనాలకు అనుమతులు ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు వీఐపీ ప్రోటోకాల్‌ దర్శనాలకు సమయం కేటాయించడంతో ప్రముఖులు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో కార్లలో కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో కొండపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగి ట్రాఫిక్‌ జామ్‌కు దారితీస్తోంది.

ఘాట్‌ రోడ్డుపై వాహనాల బారులు..

కొండపైకి వెళ్లే కార్లతోపాటు దిగువకు వస్తున్న వాహనాలు ఒకేసారి ఘాట్‌ రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఓం టర్నింగ్‌ నుంచి దిగువ ఘాట్‌ రోడ్డు ప్రారంభ ప్రాంతం వరకు కార్లు బారులు తీరుతున్నాయి. దీనికితోడు ఘాట్‌ రోడ్డులోని ఇరుకైన ప్రదేశాల్లోనే కొందరు వాహనాలను నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌ మరింత మందగిస్తోంది. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన చోట నియంత్రణ కొరవడటంతో సమస్య తీవ్రతరమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

.ద్విచక్ర వాహనాలదీ అదే పరిస్థితి..

కొండపైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని అధికారులు ప్రకటించినప్పటికీ.. పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బైక్‌లు పార్కింగ్‌ చేసి కనిపిస్తున్నాయి. ఆలయ అర్చకులకు మాత్రమే ద్విచక్ర వాహనాల అనుమతి ఉంటుందని చెప్పినప్పటికీ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్తు తదితర శాఖల సిబ్బంది తమ బైక్‌లతో కొండపైకి వస్తున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నిబంధనలు ఎవరి కోసం..?

వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాల కోసం వచ్చే కార్లతోపాటు పోలీసు, రెవెన్యూ, న్యాయశాఖకు సంబంధించిన వాహనాలు కూడా పెద్దసంఖ్యలో కొండపైకి చేరుతుండటంతో ట్రాఫిక్‌ ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు సామాన్య భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు వాహనాల ప్రవేశం, పార్కింగ్‌పై స్పష్టమైన నియంత్రణ లేకపోవడం సమస్యగా మారుతోంది. కొండపైకి ఏ వాహనాలను అనుమతించాలి? ఎక్కడ పార్కింగ్‌ కల్పించాలి? రాకపోకలను ఎలా క్రమబద్ధీకరించాలి? అనే అంశాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.