కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ నరకం.. వన్‌వే తొలిరోజే తిప్పలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం ఉదయం నుంచి అమలు చేసిన వన్‌వే ట్రాఫిక్ విధానం తొలిరోజే వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉదయం రద్దీ వేళల్లో రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వందల మీటర్ల మేర కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. హెచ్-సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మౌలిక వసతుల పనులకు వీలుగా, ట్రాఫిక్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి వన్‌వే విధానాన్ని అమలు చేశారు. అయితే ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. రోడ్డు నంబర్ 14, రోడ్డు నంబర్ 12, రోడ్డు నంబర్ 10కు అనుసంధానమైన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మధ్యాహ్నం 11 గంటల సమయానికి ట్రాఫిక్ జామ్ ప్రభావం శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు కూడా విస్తరించింది. సాధారణంగా సిగ్నళ్ల వద్ద రద్దీ ఉండే మార్గాల్లో వన్‌వే అమలు చేసినప్పటికీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఏర్పడింది.
పాదచారుల పరిస్థితి మరింత దారుణం
వన్‌వే విధానంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పని కోసం వెళ్లేవారు, ప్రజా రవాణా కోసం రోడ్లు దాటేవారు తీవ్ర అవస్థలు పడ్డారు. కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సిగ్నల్ దగ్గర మాత్రమే రోడ్డు దాటేందుకు అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ఇతర ప్రాంతాల్లో పాదచారుల ఇబ్బందులపై ఫిర్యాదులు వస్తున్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని ఓ ట్రాఫిక్ అధికారి తెలిపారు.
బస్సు ప్రయాణికుల్లోనూ గందరగోళం
వన్‌వే కారణంగా బస్సులు నిలిపే ప్రదేశాల్లో మార్పులు చేయడంతో ప్రయాణికులు ఉదయం నుంచే గందరగోళానికి గురయ్యారు. తమకు అలవాటైన బస్ బేల వద్ద బస్సులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ప్రయాణికులు ఎక్కడ బస్సు ఎక్కాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం తొలిరోజే ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ట్రాఫిక్ రద్దీని ఎలా నియంత్రిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
