సంస్థాగత ‘రెబల్స్‌’పై టీపీసీసీ రెక్కీ!

  • క్షేత్రస్థాయి రాజకీయ పరిణామాలపై ఇప్పటి నుంచే పర్యవేక్షణ
  • సీఎం ఆదేశంతో రహస్య ఏజెంట్లుగా రంగంలోకి స్టేట్‌ ఇంటలిజెన్స్‌ వర్గాలు
  • ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీల వ్యతిరేక వైఖరిపై ఆరా
  • కొన్ని జిల్లాల్లో ఒకరిద్దరు, మరికొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో నేతల గుర్తింపు
  • క్షేత్ర పర్యటనల్లో ఉన్న సందర్భాల్లో మంత్రుల వ్యాఖ్యల పైనా సమాచార సేకరణ
  • ఒక్కో నేత దినచర్యపై ఫాలోఅప్‌కు ఇద్దరు చొప్పున దూతల నిఘా
  • టీపీసీసీ అంతర్గత సర్వే రిపోర్టుతో సీఎం రేవంత్‌ రెడ్డి అప్రమత్తం
  • పార్టీకి నష్టం కలిగిస్తున్న వారిపై దశల వారీగా వేటుకు సన్నాహాలు
  • అధికార దుర్వినియోగం జరుగుతోందంటూ విపక్షాల నుంచి విమర్శలు
  • సంస్థాగతంగా పార్టీకి నష్టం కలిగిస్తున్న వ్యవహారాలపై ఏఐసీసీకి నివేదిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో :

పార్టీ సంస్థాగత బలోపేతానికి ఎదురవుతున్న అంతర్గత సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్రజెండాలతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ చేతులు కలపాలన్న ప్రయత్నాల్లో ఉన్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఉనికిని పదిలపరుచుకునే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఎన్నికల నాటికి సొంత పార్టీ నేతల నుంచే కాంగ్రెస్‌కు ముప్పు పొంచి ఉందన్న అంతర్గత నివేదికల హెచ్చరికలతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు.

కొన్ని జిల్లాలతో పాటు అనేక నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్న వర్గ విభేదాలు వాటంతట అవే సమసిపోయే పరీస్థితి కనిపించకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో బహిర్గతమైన విభేదాలు విపక్షాల విమర్శలకు ఊతమిచ్చాయన్న సీనియర్ల వాదనతో ఏకీభవిస్తూ.. తనదైన శైలిలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్న రెబల్స్‌పై రెక్కీ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో ప్రభుత్వ విధానాలపైనా ప్రతికూలంగా మాట్లాడుతన్న నేతలతో పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీల వ్యతిరేక వైఖరిపై ఆరా తీసేందుకు రహస్య ఏజెంట్లుగా స్టేట్‌ ఇంటలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. కొన్ని జిల్లాల్లో ఒకరిద్దరు, మరికొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కోవకు చెందిన నేతలను గుర్తించినట్లు పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అలాగే హైదరాబాద్‌లో ఎన్నపుడు తనతో అన్యోన్యంగానే ఉంటూ క్షేత్ర పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపైనా రేవంత్‌ రెడ్డి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒక్కో నేత దినచర్యపై ఫాలోఅప్‌ చేయడానికి ఇద్దరు చొప్పున పోలీసు దూతలను నియమించి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇటీవలే సీఎంకు అందిన టీపీసీసీ అంతర్గత సర్వే రిపోర్టు అధ్యయన సమాహారమేనని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం హెచ్చరికలతో అప్రమత్తం అయ్యారని పీసీసీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీకి నష్టం కలిగిస్తున్న వారిపై దశల వారీగా వేటు-కు సన్నాహాలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారాలను వివరించి, సంస్థాగత ప్రక్షాళన దిశగా చర్యలకు సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ అధిష్టారం అనుమతి కోరనున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రభుత్వంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని, అధికార దుర్వినియోగం జరుగుతోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో అంతర్గత విభేదాలపై కొద్ది రోజుల క్రితమే ఏఐసీసీ అధిష్టానం చెంతకు ఫిర్యాదులు వెల్లువలా చేరాయి.

కొందరు ఫ్యాక్స్‌ ద్వారా, మరికొందరు మెయిల్‌ ద్వారా సీనియర్లు అధిష్టానం పెద్దలను సంప్రదిస్తూ తాజా పరిణామాలతో పార్టీకి జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. తాజాగా పదవుల పందేరం మొదలుకుని పార్టీ బాద్యతల వరకు కాంగ్రెస్‌లో జరిగిన ప్రక్రియలో ఆశాభంగానికి గల కారణాలు, ఉద్దేశపూర్వక నియామకాలపైనా పార్టీ పెద్దలకు లిఖితపూర్వక సమాచారం వెళ్లింది. తాజాగా పార్టీలో, ప్రభుత్వంలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి.

త్వరలోనే సీఎం రేవంత్‌ రాజకీయ కార్యాచరణ అమల్లోకి వస్తుందని అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు చెబుతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో మంత్రివర్గంలోకి మరో ముగ్గురు నేతలు రాబోతున్నారన్న విషయంపైనా ప్రచారం కూడా జోరందుకుంది. తాజాగా సీఎం, పీసీసీ చీఫ్‌ ఢిల్లి పర్యటన తర్వాత ఆశావహుల్లో మరోసారి కదలికలు మొదలయ్యాయి. కొందరు సీనియర్లు, అనేక మంది జూనియర్లు, పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నుంచి పనిచేసిన నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అంతర్గతంగా ఇప్పుడున్న వారిలో ఉద్వాసనపై ఉత్కంఠ, అలకలు, చురకలు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పదవుల్లో ప్రధాన్యతలపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, వర్గ విభేదాలు కూడా చాలా బలంగానే కనిపిస్తున్నాయి. ఇటు పీసీసీలో, అటు ప్రభుత్వంలో కీలక శాఖల్లోనూ మార్పులు ఉంటాయన్న సంకేతాలతో ఢిల్లిd స్థాయి పైరవీలు జోరందుకున్నాయి. కానీ, ఏఐసీసీలో పరిస్థితులు మాత్రం ఒకవైపే మొగ్గు చూపుతున్నాయి.

పదవుల పంపకంలో ప్రథమ ప్రాధాన్యతగా సీఎం రేవంత్‌, ద్వితీయ ప్రాధాన్యతగా పీసీసీ చీఫ్‌ మహేష్‌ సంయుక్త నిర్ణయమే శిరోదార్యమంటూ తాజాగా అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం తమ అనుచర బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ రాజకీయ కార్యాచరణ అమలుకు అనుమతి పొందే వ్యూహంతోనే హస్తినకు వెళ్లినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లతో కలిసి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వేర్వేరు భేటీల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, పార్టీలో జరుగుతున్న తాజా వ్యవహారాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలి? అనే విషయాలపై వీరు అధిష్టానంతో చర్చించిన తర్వాత సంస్థాగతంలో తీసుకున్న నిర్ణయాలను అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్‌ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్‌ పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే మంత్రివర్గంలో చోటు-కోసం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జితో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు అధిష్టానం పెద్దలను ఒప్పించిన అనంతరం వారు సూచించిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కబోతుందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ విషయాలేవీ బయటకు పొక్కకుండా టీపీసీసీ జాగ్రత్త పడుతోంది.