అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా..

అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా..

  • విజయవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ఐఆర్డిపిఆర్ – కేశినేని ఫౌండేషన్ ఒప్పందం
  • తొలి విడతలో ఏ.కొండూరు, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల ఎంపిక
  • సుస్థిర వ్యవసాయం, ఉపాధి సృష్టి, నైపుణ్యాభివృద్ధి ప్రధాన లక్ష్యాలు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతి రాజ్, కేశినేని ఫౌండేషన్ మధ్య శనివారం హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంపై ఎన్ఐఆర్డిపిఆర్ తరఫున సీనియర్ కన్సల్టెంట్ డా. మొహమ్మద్ ఖాన్, కేశినేని ఫౌండేషన్ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సంతకాలు చేశారు.

దేశానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా విజయవాడ అభివృద్ధి…

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి మోడల్‌గా మార్చి, దేశానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా నిలబెట్టడమే మా లక్ష్యం. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి, ఉపాధి సృష్టి, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం వంటి అంశాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని పేర్కొన్నారు.

విజయవాడలో ప్రతి గ్రామం, ప్రతి వాడ అభివృద్ధి చెందేలా ఎన్ఐఆర్డిపిఆర్ సాంకేతిక సహకారంతో కేశినేని ఫౌండేషన్ పలు కార్యక్రమాలను చేపడుతుందని ఆయన వివరించారు.

మొదటి విడతలో మూడు మండలాలు..

ప్రాజెక్టు మొదటి దశలో ఏ.కొండూరు, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ అభివృద్ధి లక్ష్యంగా పలు ప్రాజెక్టులు అమలు కానున్నాయి. కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఆర్గానిక్ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్షన్, సీడ్ బ్యాంకులు, నేచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను అమలు చేయనున్నారు. అభివృద్ధి ప్రణాళికలో స్థానిక పంచాయతీలు, మండల అధికారులు, యువజన సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం అవుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

లోకల్ అడ్మినిస్ట్రేషన్‌తో వర్క్‌షాప్…

ఎన్ఐఆర్డిపిఆర్ తరఫున అక్టోబరు 22న స్థానిక పరిపాలన అధికారులతో కలిసి ఒక ఫీజిబిలిటీ మరియు వైయబిలిటీ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రాజెక్టు అమలు విధానం, ఫీల్డ్ లెవెల్ టీమ్‌ల ఏర్పాటుపై చర్చించనున్నారు . ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రతి మండలానికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

సమన్వయ కమిటీ ఏర్పాటు…

ఎంఓయు నిబంధనల ప్రకారం ఎన్ఐఆర్డిపిఆర్ తరఫున డా. మొహమ్మద్ ఖాన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. కేశినేని ఫౌండేషన్ తరఫున కూడా ప్రతినిధిని నియమించనున్నారు. ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ, డేటా సేకరణ, ప్రగతి అంచనా తదితర పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జనరల్ డా. జి. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఎంపీ కేశినేని శివనాథ్ ను అభినందిస్తున్నాం.

ఆయన ఆధ్వర్యంలో విజయవాడ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళిక దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. రవీంద్ర గవలి, డాక్టర్. కేశవ రావు, డాక్టర్. ఆర్.రమేష్, డాక్టర్. సంధ్యా గోపకుమారన్, డాక్టర్. నిత్య, మురళీ కృష్ణ, కేసి బెహరా, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply