నిజాయితీని చాటుకున్న బస్ కండక్టర్ నాగేశ్వరరావు
బస్సులో మరిచిపోయిన బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును ప్రయాణికురాలికి అప్పగింత.. సన్మానించిన డిపో మేనేజర్
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో నిజాయితీని చాటుకున్న సీనియర్ బస్ కండక్టర్ దుర్సోజు నాగేశ్వరరావును డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి అభినందించి సత్కరించారు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను ఆమె వెల్లడించారు. నాగేశ్వరరావు విధులు నిర్వహిస్తున్న బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు మోత్కూరు వద్ద ఎక్కి భువనగిరిలో దిగారు. ఈ క్రమంలో తన బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. అది గమనించిన కండక్టర్ బ్యాగును పరిశీలించగా అందులో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా మహిళకు సమాచారం అందించి, ఆమెకు బ్యాగును తిరిగి అప్పగించారు.
నాగేశ్వరరావు ఉద్యోగ ధర్మంతో పాటు నిజాయితీని చాటుకోవడం అభినందనీయమని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి పేర్కొన్నారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. బస్సులోని ప్రయాణికులు సైతం కండక్టర్ నిజాయితీని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
