Saturday, November 23, 2024

జికా వైరస్ లక్షణాలు ఇవే..

దేశంలో ఓవైపు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. జికా వైరస్ కేసుల సంఖ్య 14కు చేరింది. మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. మొత్తం 14 మందికి జికా వైరస్ ఉన్నట్టుగా తేలింది.

దోమ కాటు వలన వ్యాప్తి చెందుతున్న జికా.. డెంగ్యూ, మలేరియా మాదిరిగానే ఒక రకమైన వైరస్. ఇది ప్రధానంగా ఈడెస్ దోమల ద్వారా వస్తుంది. ఈ జికా వైరస్‌కు పగటిపూట కుట్టే దొమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. జికా వైరస్‌ను 1947 లో ఆఫ్రికాలో మొదటగా గుర్తించారు. సాధారణంగా ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. జికా ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

జికా వైరస్ లక్షణాలు

జికా వైరస్ సోకితే జ్వరం, దద్దుర్లు, కండ్ల కలకలు, కీళ్ల నొప్పులు, తల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ ఏడెస్ దోమ వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతోంది. ఏడెస్ దోమలు నిల్వ ఉన్న నీటిలో సంతానోత్పత్తిని చేస్తాయి. జికా వైరస్ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ బారినపడిన వారిలో కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలను కనిపించకపోవచ్చు. జికా వైరస్ గర్భవతులకు చాలా ప్రమాదం. కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ నియంత్రణకు ఎటువంటి టీకాలు కాని, మందులు కాని ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.

జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. అయితే, మొదట రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. తాము జికా బారిన పడ్డామని తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది. జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. దీని బయటపడేందుకు రెండు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. మెదడు, వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడుతాయి. దీని వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: సెప్టెంబరు నుంచి చిన్నారులకు కరోనా టీకా

Advertisement

తాజా వార్తలు

Advertisement