Tuesday, November 26, 2024

బ్రిట‌న్ లో ప‌ర్య‌టించిన జెలెన్ స్కీ.. సాయ‌మందించాల‌ని కోరిన ఉక్రెయిన్ అధినేత‌

బ్రిట‌న్ లో ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ.ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రిషి సునక్‌, బ్రిటీష్‌ రాజు చార్లెస్‌తో భేటీ అయ్యారు. అనంతరం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అక్కడి నుంచి ఆయన ఫ్రాన్స్‌ చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఓలోఫ్‌ స్కోల్జ్‌లను కలిశారు. రష్యాకు గట్టి సవాల్ విసిరేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపాలని ఫ్రాన్స్, జర్మనీలను జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్ విజయం సాధించడంతోపాటు శాంతి కోసం, యూరప్ కోసం, ప్రజలు తమ హక్కులను పొందేందుకు తమ దేశం అండగా ఉంటుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్‌కు సహాయం అందించడానికి తాము తమ ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్‌తో మొత్తం యూరప్ భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. రష్యా గెలవదు, గెలవకూడదని మాక్రాన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు, జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్, యూరోపియన్ కుటుంబంలో ఒక భాగమని చెప్పారు. జర్మనీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు, మానవతా సహాయం అందించిందని, ఉక్రెయిన్‌కు అవసరమైనంత వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు లియోపార్డ్‌ ట్యాంకులను ఇవ్వనున్నట్లు జర్మనీ ప్రకటించింది. మొదటి ట్యాంక్ బెటాలియన్ ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌ నగరం కైవ్‌కు చేరుకుంటుందని జర్మనీ రక్షణ మంత్రి తెలిపారు. అమెరికా, బ్రిటన్ కూడా ఉక్రెయిన్‌కు పలు ట్యాంకులు, ఆయుధాలను పంపుతామని హామీ ఇచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన అనంతరం జెలెన్‌స్కీ తొలిసారి యూరప్‌లో పర్యటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement