Friday, November 22, 2024

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ‘జెలెన్ స్కీ’ని – న‌వ్వుల్లో ముంచెత్తిన చిన్నారి

త‌మ దేశం కోసం తుదివ‌ర‌కు పోరాడుతూనే ఉంటామ‌ని క‌ఱాకండీగా తేల్చి చెప్పారు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. ర‌ష్యా ఎంత‌గా భ‌య‌పెడుతున్నా అద‌ర‌క..బెద‌ర‌క అన్న‌ట్టుగా ఉన్నారాయ‌న‌. కాగా రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ టీనేజర్ అడిగిన ప్రశ్న జెలెన్ స్కీని షాక్ కు గురి చేసి.. నవ్వులు పూయించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు సమీపంలోని వోర్జెల్ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జెలెన్ స్కీ తాజాగా పరామర్శించారు. అందరి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలిక వద్దకు వెళ్లిన ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. అయితే.. ఆ బాలిక మాత్రం ‘‘మీరు టిక్ టాక్ స్టార్ కదా.. మీకు చాలా మంది టిక్ టాక్ లో మద్దతిస్తున్నారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయం మీ గురించే అంటూ చెప్పింది. ఆ అమ్మాయిని కాత్యా వెలషెంకోగా గుర్తించారు. ఆ అమ్మాయి మాటలను సరదాగా తీసుకున్న జెలెన్ స్కీ.. ‘‘అంటే, మేం టిక్ టాక్ ను ఆక్రమించేశామన్నమాట’’ అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు. కాత్యా మాటలు అమాయకంగా అనిపించినా.. ఆ చిన్నారి వీరోచిత సాహసంపై మాట్లాడేందుకు మాత్రం మాటలు సరిపోవు. రష్యా చేసిన దాడి నుంచి తన 8 ఏళ్ల తమ్ముడిని కాపాడుకునేందుకు.. తన ప్రాణాన్నే అడ్డువేసిందా చిన్నారి. రష్యా షెల్స్ తన తమ్ముడికి తగలకుండా దాచేసి.. తాను వాటికి బాధితురాలిగా మారిందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. గాయపడిన చిన్నారిని ఆమె తండ్రి చేతుల మీద మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement