Friday, November 22, 2024

వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి ? కొత్త టీటీడీ ఛైర్మన్ ఎవరు?

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ఇదే విషయం చర్చనీయాంశమైంది. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ జూన్‌తో ముగియనుంది. సీఎం జగన్ ఆయన్నే కొనసాగిస్తారా ? లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా ? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే, త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, టీటీడీ చైర్మన్ గా నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలో సీఎం జగన్ మంత్రి పదవులు రెండున్నర సంవత్సరాలేనని స్పష్టం చేశారు. తర్వాత రెండున్నర ఏళ్లు సీనియర్లకు అవకాశమిస్తానని ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో ఆరు నెలల్లో మంత్రి వర్గ కూర్పు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పదవి ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డిని ఎమ్మెల్సీగా చేసి తర్వాత కేబినెట్ లో తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

2014 ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు. అయితే, 2019 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ దక్క లేదు. సుబ్బారెడ్డిని కాదని టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన మాగంటి శ్రీనివాసులరెడ్డికి కేటాయించారు జగన్. దాంతో అప్పట్లోనే సుబ్బారెడ్డి కినుక వహించారు. అయితే, అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తాననే జగన్ హామీతో మెత్తబడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లుగా సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2019 జూన్ 21న టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ నెల 21వ తేదీతో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్ల కాలంలోనే టీటీడీ నిర్ణయాలపై ఎన్నో వివాదాలు, మరెన్నో ఆరోపణలు వచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. అయితే, వివాదాలు వచ్చిన ప్రతిసారి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాల్సి వచ్చింది. మరోవైపు రాజ్యసభకు వెళ్లాలని వైవీ సుబ్బారెడ్డి భావించారు. అయితే, రాజకీయ సామాజిక సమీకరణలతో ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో వైవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. అనంతరం కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు ఇవే!

Advertisement

తాజా వార్తలు

Advertisement