Friday, November 22, 2024

YSRCPలో ప్ర‌క్షాళన‌తో శ్రేణులలో అలజడి..

రాబోయే ఎన్నికలకు వైసీపీ తాను రచించిన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీంతో సీనియర్లకు మనస్తాపం తప్పనిసరి. అలకలు మామూలే. కానీ ప్రజల వ్యతిరేకతను వదిలించుకోకపోతే… పార్టీ మనుగడే కష్టం, అందుకే ఈ నిర్ణయాలు వెలువడుతున్నాయని వైసీపీ శ్రేణులు తమలో తాము సమర్థించుకొంటున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ ప్రక్షాళనతో ఏపీలోని అన్ని జిల్లాల్లో వైసీపీ సిట్టింగులు కంగారు పడుతున్నారు. ప్రక్షాళన జాబితాలో తమ స్థానం ఏమిటో అర్థం కాక జట్టు పీక్కుంటున్నారు. కృష్ణాజిల్లాలోనూ సిట్టింగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పశ్చిమలోనూ అలజడి సృష్టించింది. కృష్ణాజిల్లాలో కీలక నేతలు మంత్రి జోగిరమేష్, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సీఎం జగన్ మాట్లాడారు. తాను తీసుకొంటున్న నిర్ణయాలను వివరించారు. మరుస‌టి రోజునే రాజమహేంద్రవరం, ఏలూరు ఎంపీలు కూడా రాజీనామా అస్త్రాల‌ను సంధించారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత 15 రోజుల కిందటే మంత్రి జోగిరమేశ్‌ను ఏలూరు ఎంపీగా పంపిస్తున్నట్టు సంకేతాలు వచ్చాయి. కానీ, తాను పెడన విడిచి వెళ్లనని, లేకపోతే మైలవరం సీటు ఇవ్వాలని జోగి ప్రతిపాదించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఏలూరు ఎంపీ కూడా రాజీనామా చేయటం, రాజమహేంద్రవరం ఎంపీ రాజీనామా చేసి.. బీసీలకే ప్రాధాన్యం ఇచ్చే విషయంలో.. తన స్థానంలో బీసీ అభ్యర్థి వస్తారని తెలపటం విశేషం. ఈ ప్రకారం జోగి రమేశ్‌కు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. పైగా మాజీ మంత్రి కొడాలి నాని కూడా తమ పార్టీ బీసీలకే ప్రాధాన్యం ఇస్తోందని మీడియాకు వివరించటం మరో విషయం.

జిల్లాల్లో.. అలజడి

గెలుపు గుర్రాల కోసం అన్వేషణకు రంగం సిద్ధం చేసుకున్న వైసీపీ సిట్టింగులకు షాక్‌లు ఇచ్చింది. ఏపీలో 47 నుంచి 65 స్థానాల్లో సిట్టింగులు మారిపోతారని, కొందరికి టిక్కెట్లు రావు. మరికొందరికి స్థానభ్రంశం తప్పదని గుంటూరు, ప్రకాశం జిల్లాల మార్సులు, చేర్పులు నిరూపించాయి. ఐతే, ఆయా నియోజకవర్గాల్లో ఈ మార్పులను వైసీపీ నాయకులు అంగీకరించటం లేదు. రేపల్లెలో మోపిదేవి వెంకట రమణ అనుచర వర్గం సోమవారం రాత్రి నుంచే ఆందోళనకు దిగింది. నియోజకవర్గంలో టైర్ల దహనంతో నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ సీటులో వైసీపీ ఓడిపోయింది. అక్కడ్నించి గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌ గెలిచారు. ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్‌ను రేపల్లె ఇన్‌చార్జిగా వైసీపీ రంగంలోకి దించింది. గణేష్‌ తల్లి ఈవూరు సీతారావమ్మ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గణేష్‌ను రంగంలోకి దించడం వల్ల…గౌడ ఓట్లతో పాటు స్థానికంగా వైసీపీకి పెద్దదిక్కు ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు సామాజిక వర్గం మత్స్యకారుల ఓట్లు కూడా పడతాయని వైసీపీ భావించింది.

ఎక్క‌డా త‌గ్గ‌ని మోపిదేవి వ‌ర్గం..
మోపిదేవి వెంకటరమణ వర్గం ఎక్కడా తగ్గటం లేదు. రేపల్లెలోని వైసీపీ కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. మోపిదేవికి మద్దతుగా150 మంది నేతలు రాజీనామా చేశారు.మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్‌లు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలనాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాడికొండలోనూ ఇదే స్థితి ఏర్పడింది. గత ఇన్చార్జికి అన్యాయం జరిగిందని ఒకటే గోల. ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ కూడా మౌనం పాటించారు. తాజాగా ఉభయ గోదావరి , ఉత్తరాంధ్రా జిల్లాల్లోనూ అలజడి ప్రారంభమైంది. పార్టీ టిక్కెట్టు తమకు రాదని ముందు గ్రహించిన నేతలు రాజీనామా లేఖలతో సర్వసన్నద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా .. వైసీపీలో మార్పులు చేర్పులు తథ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement