Monday, November 18, 2024

వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఎంపీ విజయసాయి మీడియాతో మాట్లాడారు. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ మొదట్నుంచీ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, పోలవరం ప్రాజెక్ట్‌ పెండింగ్‌ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు.

తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. కేఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల కింద చుక్క నీరు అదనంగా తీసుకోమని, 800 అడుగుల్లోనే లిఫ్ట్‌కి అనుమతి ఇవ్వాలన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ అనేక ప్రాజెక్ట్‌లు కట్టిందని, ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జల వివాదంపై కేంద్రం సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పారు. తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్‌ బకాయిలు రావాలన్నారు. రావాల్సిన విద్యుత్‌ బకాయిలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని విజయసాయి చెప్పారు. ఇప్పటివరకు 12సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాంమని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని కోరతామన్నారు. ట్రైబల్‌ యూనివర్శిటీని నాన్‌ట్రైబల్‌ ప్రాంతంలో కేటాయించారని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే ఉపాధిహామీలో 6,750 కోట్లు బకాయిలు వచ్చేలా పోరాడతామన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement