Tuesday, November 26, 2024

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్ట్!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజును నాటకీయ పరిణామాల మధ్య ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రఘురామరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు.రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది. 

గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును సైతం ఆయన ఆశ్రయించారు. రఘురామ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది.

ఇదీ చదవండి: ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్!?

Advertisement

తాజా వార్తలు

Advertisement