దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి ఇప్పటికే అడుగు పెట్టేశారు. శుక్రవారం ఖమ్మం వేదికగా తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా పార్టీ స్థాపించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించబోతున్న సంకల్ప సభలో నేరుగా అధికార టీఆర్ఎస్ పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సభ సాయంత్రం 5 గంటల తరువాత జరగనుండగా, ఈ ఉదయం 8 గంటలకు ఆమె రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరనున్నారు.
షర్మిల వెంట తరలి వెళ్లేందుకు ఇప్పటికే భారీ ఎత్తున షర్మిల అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకోవడంతో సందడి మొదలైంది. వందల కొద్దీ వాహనాలు ఆమెతో పాటు బయలుదేరి వెళ్లనున్నాయి. లోటస్ పాండ్ నుంచి బయలుదేరే షర్మిల కాన్వాయ్… లక్డీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మీదుగా ప్రయాణించి, 9.30 గంటలకు హయత్ నగర్ చేరుకుంటుంది. అక్కడ ఆమె అభిమానుల స్వాగతాన్ని స్వీకరిస్తారు. ఆపై చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట మీదుగా ఆమె కాన్వాయ్ సాగనుంది. దారిపొడవునా షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాపేట దాటిన తరువాత చివ్వెంల వద్ద ఆమె మధ్యాహ్న భోజన విరామం తీసుకుని, నామవరం, నాయకన్ గూడెం మీదుగా సాయంత్రం 5.15 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు.
ఇక ఈ సభను విజయవంతం చేయాలన్న ప్రణాళికతో వైఎస్ఆర్, షర్మిల అభిమానులు, ముఖ్య నేతలైన కొండా రాఘవరెడ్డి, సతీశ్ రెడ్డి వంటి వారి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఈ సభకు వైఎస్ భార్య విజయమ్మ కూడా హాజరు కానుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక ఈ సభలోనే తెలంగాణలో తాను పార్టీని పెట్టబోయే తేదీ గురించిన వివరాలను షర్మిల వెల్లడిస్తారని ఆమె వర్గం నేతలు అంటున్నారు. తెలంగాణ వచ్చి ఆరేళ్లవుతున్నా గతంలో రాజన్న అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? అంటూ ఇప్పటికే షర్మిల ప్రశ్నాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ ఇమేజ్ ను తెలంగాణలో తన పార్టీకి రాబట్టుకునేలా షర్మిల అడుగులు ఉంటున్నాయి. అందుకే ప్రతీ సమావేశంలోనూ రాజన్న ఉండి ఉంటే ఏఏ పథకాలు ఉండేవో వల్లె వేస్తూ వస్తున్నారు. అందుకే పార్టీ పేరులో కూడా వైఎస్ఆర్ అనే పేరు ఉండేలా షర్మిల నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే పార్టీ వర్గాల్లో మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.