దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల.. ఇడుపులపాయ వద్ద నివాళులర్పించారు. వైఎస్ ఘాట్ వద్దకు విజయమ్మ, వైఎస్ వివేకా కుమార్తె సునీత, అనిల్ కుమార్ చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతీ ఏటా ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా వైఎస్సార్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా నివాళి అర్పించే వారు. గత ఏడాది నుండి మాత్రం ఇలా.. అన్నా..చెల్లి వేర్వేరుగా ఘాట్ వద్దకు వస్తున్నారు.
తన కుమార్తె-కుమారుడుతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద కూర్చొని చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. పార్టీ జెండాను వైఎస్సార్ సమాధి వద్ద ఉంచారు. పార్టీ నేతలు ఇందిరా శోభన్, పిట్టా రాంరెడ్డి, కొండా రాఘవ రెడ్డి సైతం ప్రార్ధనల్లో పాల్గొన్నారు. తన తండ్రికి నివాళి అర్పిస్తూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రస్తుతం సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య గ్యాప్ ఏర్పడింది. గతంలో ఎంతో ఆప్యాయంగా ఉండే అన్నా..చెల్లి ఇద్దరూ ఎవరి దారిలో వారు పయణిస్తున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రతీ ఏటా ఉదయం సమయంలోనే నివాళి అర్పించే జగన్.. ఈ ఏడాది మాత్రం సాయంత్రానికి తన సమయం మార్చుకున్నారు. ఉదయం షర్మిల అక్కడకు వస్తుండటంతో..ఇద్దరూ ఒకే సమయంలో తమ తండ్రి సమాధి వద్ద కలుసుకుంటారని వైఎస్సార్ అభిమానులు భావించారు. అయితే, అనుహ్యంగా సీఎం షెడ్యూల్ సాయంత్రానికి మారింది.
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని నేడు ప్రటకించనున్నారు. రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు ఆమె ప్రకటించబోతున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలికేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, ఎజెండాపై గంటా 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన సీఎం జగన్