Thursday, November 21, 2024

రేపే షర్మిల పార్టీ ప్రకటన.. బాలాజీ సన్నిధిలో పార్టీ జెండా

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ కొత్త పార్టీ స్థాపించబోతున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పార్టీ జెండా, అజెండా అన్ని సిద్ధం చేశారు. దివంగత సీఎం వైఎస్ జయంతి సందర్భంగా రేపు(జులై 8) పార్టీ పేరును ప్రకటించనున్నారు. హైదరాబాద్ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును షర్మిల ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం షర్మిల పార్టీ నేతలు చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఆలయంలో పార్టీ జెండా, కండువాకి ప్రత్యేక పూజలు చేయించారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం షర్మిల పాటుపడుతున్నారని ఆపార్టీ కీలక నేత కొండా రాఘవరెడ్డి అన్నారు. సకల జనుల సంక్షేమమే తమ అజెండా అని స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు ఉండగా.. మిగిలిన 20 శాతం నీలి రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు.  ఈ పార్టీని దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న ప్రారంభించనున్నారు. పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే షర్మిల తన పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రియను కొత్త పార్టీకి వ్యూహకర్తగా వైఎస్ షర్మిల ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ..

Advertisement

తాజా వార్తలు

Advertisement