రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల విషయంలో నిజమైంది. తెలంగాణ సర్కార్ పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఎప్పుడు విమర్శలు చేసే షర్మిల.. తొలిసారి మంత్రి కేటీఆర్‌కి మద్దతుగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్లితే.. బీజేపీ నేత తీన్మార్ మల్లన్న ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును కించపరిచేలా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన షర్మిల.. ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘పిల్లలకు ఒక తల్లిగా, రాజకీయ పార్టీ నేతగా రాజకీయాల్లోకి గుంజడాన్ని ఖండిస్తున్నా. కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలను సహించేది లేదు. మహిళలను కించపరిచినా, పిల్లలను కించపరిచినా.. మనం రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి’’ అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడంపై మంత్రి కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..