Monday, November 18, 2024

కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా? బండ‌నా?

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎవ‌రి ఉద్యోగం ఊడిపోతుందో.. ఎందుకు ఊడిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఏం తప్పు చేశార‌ని వారిని తొల‌గించారు? అని ప్రశ్నించారు. హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్కు వ‌ద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు చేప‌ట్టిన దీక్ష‌కు బుధ‌వారం వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు శ్రీమ‌తి వైయ‌స్ ష‌ర్మిల గారు సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా దీక్షా వేదిక‌పై ప్ర‌సంగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 7,651 ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను తొల‌గించ‌డం అన్యాయం అని అన్నారు. ఉద్యోగాలు పోయాయ‌న్న బాధ‌తో ఇప్ప‌టివ‌ర‌కు 50 మంది ప్రాణాలు విడిచారని, వారి కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంతో సంపాదించార‌ని అధికార పార్టీ లీడ‌ర్లు చెప్ప‌డం దుర్మార్గం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవ‌రైనా సంపాదించుకున్నారు అంటే అది కేవ‌లం కేసీఆర్, ఆయ‌న‌ కుటుంబం మాత్ర‌మేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వ‌రం రీడిజైనింగ్, మిష‌న్ భ‌గీర‌థ పేరుతో నిస్సిగ్గుగా వేల కోట్లు క‌మీషన్లు తిని, ఫాం హౌజ్‌లో దాచిపెట్టుకున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో తెలంగాణ సాధించుకుంటే నేడు నీళ్లు కేసీఆర్ ఇంటికే, నిధులు కేసీఆర్ ఫాం హౌజ్ కే, నియామ‌కాలు కూడా కేసీఆర్ కుటుంబానికే చెందాయని పేర్కొన్నారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వ‌డం కాదు క‌దా ఉన్న ఉద్యోగాల‌కు భ‌రోసా ఇవ్వ‌ని అస‌మ‌ర్థ నాయ‌కుడు కేసీఆర్‌ అని విరుచుకుపడ్డారు.

జీతాలు పెంచాల‌ని అడ‌గ‌డం వీళ్లు చేసిన త‌ప్పా? అని షర్మిల ప్రశ్నించారు. వచ్చే రూ.9వేల జీతంతో కుటుంబం గ‌డ‌వ‌క‌నే క‌దా జీతాలు పెంచ‌మ‌ని అడిగింది?అని పేర్కొన్నారు.  ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాల‌ను పీకేశారంటే కేసీఆర్ చాతిలో ఉన్న‌ది గుండెనా? బండ‌నా? అని మండిపడ్డారు. కేసీఆర్ ఒక‌ప్పుడు కేంద్రంలో కార్మిక‌శాఖ మంత్రిగా ప‌నిచేశారని, కానీ కార్మికుల అవ‌స‌రాలు మాత్రం ప‌ట్ట‌వన్నారు. నిజానికి ముఖ్య‌మంత్రినే ఉద్యోగం నుంచి పీకేయాలన్నారు. ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌ని ముఖ్య‌మంత్రికి ప‌ద‌వి అక్క‌ర్లేదన్నారు. వారి కుటుంబానికి ఐదు ఉద్యోగాలు కూడా అవ‌స‌రం లేదన్నారు.

కేవలం ప్ర‌శ్నించినందుకే ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను తొల‌గించారని మండిపడ్డారు. ప్ర‌శ్నించ‌డం తెలంగాణ హ‌క్కు, తెలంగాణ నినాదం, తెలంగాణ విధానం. ఇది మ‌ర్చిపోయిన కేసీఆర్ ప్ర‌శ్నించే గొంతుల్ని అణ‌చివేస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్న ఆర్టీసీ స‌మ్మెను నిర్వీర్యం చేసి కార్మికుల చావుల‌కు కార‌ణ‌మ‌య్యారని విమర్శించారు. ఎప్పుడు జీతాలు వ‌స్తాయో వాళ్ల‌కే తెలియ‌ని ప‌రిస్థితిలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారని చెప్పారు. ప్ర‌జ‌లు ప్ర‌శ్నించ‌కుండా దొర‌, బాంచ‌న్ అని మోక‌రిల్లాల‌ని కేసీఆర్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. క‌రోనా స‌మ‌యంలో 1600 మంది నర్సుల సేవ‌ల‌ను ఉప‌యోగించుకుని, రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి పీకేశారని మండిపడ్డారు. 675 మంది నర్సులు ఉద్యోగాల‌కు ఎంపికైతే.. వారికి ఇప్ప‌టివ‌ర‌కు పోస్టింగులు ఇవ్వ‌కుండా కేసీఆర్ స‌తాయిస్తున్నారన్నారు.

- Advertisement -

అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ రెగ్యుల‌ర్ చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వ‌చ్చాక 52వేల ఉద్యోగాల‌ను తొల‌గించి రెండు ల‌క్ష‌ల మంది రోడ్డున ప‌డేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్ హ‌యాంలో ప్ర‌శ్నించేవారిని వేదిక‌పైకి పిలుచుకుని స‌మ‌స్య‌లు తెలుసునేవారని, కానీ ఇప్పుడు ఆ రోజులు లేవన్నారు. కేసీఆర్ ను ప్ర‌శ్నించ‌డం కాదు క‌దా ఆయ‌న అపాయింట్ మెంట్ కూడా దొర‌క‌డం లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం బిచ్చం అడుక్కుంటున్నారని విమర్శించారు. పెద్ద దొర‌, చిన్న‌దొర ఏదైనా ప్రాంతానికి వెళ్తే రెండు రోజుల ముందే ప్ర‌శ్నించే వారిని అరెస్టు చేస్తున్నారు. స‌భ‌లో ప్ర‌శ్నిస్తే, ఆడ‌వాళ్లు అని కూడా చూడ‌కుండా కుక్కులు మొరుగుతున్నాయంటూ కేసీఆర్ విమ‌ర్శించ‌డం ఆయ‌న ఇంకిత జ్ఞానానికి నిద‌ర్శ‌నం అన్నారు. ‘’ప్ర‌శ్నిస్తే ఎందుకు అంత అస‌హ‌నం? మీరు దొర‌లా? లేదా ప్ర‌జ‌లు మీకు బానిసలా? కేసీఆర్ ముఖ్య‌మంత్రి అని చెప్పుకోడానికి తెలంగాణ ప్ర‌జ‌లు సిగ్గుతో త‌లదించుకుంటున్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: 2014లో కేసీఆర్, హరీష్ ఆస్తులెంత? ఇప్పుడెంత?: ఈటెల

Advertisement

తాజా వార్తలు

Advertisement