తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు ఖరాయింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) పేరుతో ఆమె పార్టీ ఏర్పాటు చేయనున్నారు. వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కేంద్ర ఎన్నికల వద్ద రిజిస్టర్ చేయించారు. ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’గా గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ వ్యవహరించనున్నారు. పార్టీకి గుర్తింపు వచ్చిన తరువాత అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోపు తెలపాలని అందులో పేర్కొన్నారు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8వ తేదీన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తన అన్న జగన్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి దగ్గరగా.. తెలంగాణ పేరు కలిసొచ్చేలా ఉన్నందునే వైఎస్సార్‌టీపీ పేరుకు షర్మిల మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యంమే లక్ష్యం అంటూ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విమర్శలకు పదను పెట్టారు. నిరుద్యోగం, కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం లాంటి అంశాలపై సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే విద్యార్థి, మహిళా సంఘాలతో సమావేశమైన షర్మిల.. ఏప్రిల్ 9న ఖమ్మంలో బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఇక జులై 8న పార్టీని అధికారికంగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.