తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతానని, రాజన్న రాజ్యమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల నిరుద్యోగ సమస్యపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే అనేక నాటకీయ పరిణామాల మధ్య నిరుద్యోగ దీక్ష కూడా షర్మిల చేపట్టారు. అటు ఆసుపత్రుల్లో స్టాఫ్ సహా ఉద్యోగాల భర్తీపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. కరోనా కేసుల ఉధృతి కాస్త తగ్గుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల యాత్రకు సిద్ధమయ్యారు.
ఉద్యోగాలు ఇక రావన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించి, ఓదార్చేందుకు షర్మిల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి యాత్ర చేయనున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించి, అక్కడి నుంచి నేరుగా గజ్వేల్ వెళ్లనున్నారు. మరోవైపు సీఎం సొంత నియోజకవర్గంలోనూ నిరుద్యోగ ఆత్మహత్యలు ఆగలేదు. ఉద్యోగాల కోసం కొట్లాడి, ఎదురుచూసి గుండెలు ఆగిన కుటుంబాలను పరామర్శించబోతున్నట్లు షర్మిల అనుచరులు తెలిపారు. నేరుగా గజ్వేల్ నుండే పర్యటన కావటంతో రాజకీయంగా అందరి దృష్టి ఈ యాత్రపై పడింది.