తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని.. ఇక వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వరంగల్ కు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో.. మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై వైఎస్ షర్మిల స్పందించారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగి శ్రీకాంత్ ఆత్మహత్యపై ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను.. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
‘’అయ్యా KCR సారు, “కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమో నని” నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి’’ అని షర్మిల ట్వీట్ చేశారు. కాగా, తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ గత వారం వైఎస్ షర్మిల 72 గంటల దీక్ష చేసిన సంగతి తెలిసిందే.