Monday, November 18, 2024

వైఎస్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తా

వైఎస్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్‌ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్‌మోడల్‌ అన్నారు. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశారని ఆమె గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం కోసం జలయజ్ఞానికి వైఎస్‌ రూపకల్పన చేశారని గుర్తుచేశారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని వ్యాఖ్యానించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి లక్షల ఉద్యోగాలను వైఎస్‌ భర్తీ చేశారని పేర్కొన్నారు. మహిళలు లక్షాధికారులు అవ్వాలని పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారని చెప్పారు. నిరుపేదలకు వైఎస్‌ భూమి ఇచ్చారని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్‌ రాజకీయాలకతీతంగా సాయం చేశారని తెలిపారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అని స్థాపించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదన్నారు. తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారని చెప్పారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతో మందికి భరోసా ఉండేదని చెప్పారు.

సంక్షేమ పాలనలో కేసీఆర్‌ విఫలమయ్యారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ సంక్షేమమంటే గారడిమాటల గొప్పలు..చేతికి చిప్పలు అని వ్యాఖ్యానించారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్‌ వాగ్దానం చేశారని, ఇప్పటివరకు ప్రకటనలు లేవు..ఉద్యోగాలు రావు అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:సింధియా అరుదైన ఘనత

Advertisement

తాజా వార్తలు

Advertisement