వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడటం ద్వారా వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తోంది. కరోనా గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర అమలు చేశామని తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో చూశామన్న సీఎం జగన్.. టీడీపీ హయాంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించిన విషయాన్ని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని, 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేస్తున్నామన్నారు. 2.48 లక్షల మందిలో దాదాపు 84% పేదవర్గాల వారే ఉన్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుండటం విశేషం. నేడు జమ చేసిన నగదుతో కలిపి ఇప్పటివరకు రూ.759 కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసింది.