19 చానళ్లపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించినట్టు సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ తెలిపింది. రిపబ్లిక్ డేకి ముందు భారత వ్యతిరేక ప్రచారాన్ని నివారించడానికి ఇటువంటి చర్యలు తీసుకున్నట్టు ఇవ్వాల తెలిపింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెల రోజుల క్రితం 20 YouTube చానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను నిషేధించింది. అయితే వీటిలో 19 యూట్యూబ్ ఛానెల్‌లను ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ఇవ్వాల నిషేధించింది. ఫేస్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారన్న కారణంగా వెబ్‌సైట్‌లపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. అయితే యూట్యూబ్ తీసుకుంటున్న సీరియస్ యాక్షన్ కు భయపడి అనేక ఇతర యూట్యూబ్ చానెల్‌లు కూడా భారత వ్యతిరేక ప్రచార వీడియోలను తీసివేయడం ప్రారంభించాయి.
కొంతమంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. I&B మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా దిగ్గజాలతో మరింత టచ్‌లో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై నిషేధం విధించవచ్చు. పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న కనీసం 36 యూట్యూబ్ ఛానెల్‌లు క్రియాశీల పర్యవేక్షణ, విశ్లేషణలో ఉన్నాయి. తదుపరి చర్య కోసం ఈ యూట్యూబ్ ఛానెల్‌లు పోస్ట్ చేసిన కొన్ని వీడియోలను కూడా రికార్డ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఇటీవల 20 యూట్యూబ్ ఛానెల్‌లను రద్దు చేసిన తర్వాత ఈ ఛానెల్‌లు తమంతట తాముగా ఫేక్ న్యూస్ కంటెంట్‌ను తొలగించినట్లు అధికారులు గుర్తించారు.