వాళ్లంతా టీనేజ్‌లో ఉన్న యువకులే.. ఇంకా లోకం పోకడల గురించి పూర్తిగా తెలియదు. కానీ, సినిమాల ఎఫెక్ట్ మాత్రం వారిపై చాలా ఉంది. వారు సినిమాలను చూసి ఎంతగా రియాక్ట్ అయ్యారంటే అచ్చం ఓ సినిమాలో చూపించిన విధంగా కిడ్నాప్ చేసి డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశారు. అది కుదరకపోవడంతో కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపేశారు. ఇదంతా బాలీవుడ్ మూవీ ‘‘అపహరన్” చూసి, దాని ఇన్స్పిరేషన్తోనే చేశామని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు.
ఢిల్లీలోని బురారీలో ఈ ఘటన జరిగింది. ఓ 18 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేసి.. 10 లక్షల రూపాయలిస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు కొంతమంది యువకులు. ఆ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులిద్దరూ 19 ఏళ్ల వయస్సు గల వాళ్లే. బాలీవుడ్ చిత్రం అపహరన్ నుండి ప్రేరణ పొందారు. షో రూమ్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న నిందితుల్లో ఒకరైన గోపాల్, బాధితుడు రోహన్‌తో ఫ్రెండ్షిప్ ఉంది. జనవరి 23వ తేదీన సాయంత్రం రోహన్‌ని తన పుట్టినరోజు వేడుకకు తీసుకెళ్తానని చెప్పి గోపాల్ కిడ్నాప్ చేశాడు.
రోహన్ తండ్రి మనోజ్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు సీసీ టీవీలను పరిశీలించారు. దాదాపు 200 సీసీటీవీల ఫుటేజ్ మొత్తం తనిఖీ చేశారు. తప్పిపోయిన బాలుడితోపాటు అతని స్నేహితుల లొకేషన్లను కనుగొన్నారు. అట్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా రోహన్ స్నేహితుడు గోపాల్‌ను మొన్న మిడ్నైట్ బురారీలో పట్టుకున్నారు. ఆ తర్వాత వారి స్టైల్లో జరిపిన ఎంక్వైరీలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెల్లడించాడు. తన స్నేహితులతో కలిసి రోహన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు వెల్లడించాడు. దెబ్బలకు దెయ్యం కూడా దిగొస్తుందన్నట్టు మరో ఇద్దరు సహచరుల పేర్లు కూడా బయటపెట్టాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల సుశీల్‌ను అరెస్టు చేయగా.. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.
కేసు డిటెయిల్స్ ఎంటంటే..
గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. వారు రోహన్‌ను ఒక గదికి తీసుకెళ్లారు. పార్టీ చేసుకున్న తర్వాత వారు అతనిని గొంతు కోసి చంపారు. అనంతరం డెడ్‌బాడీని పారేయాలని నిర్ణయించుకుని ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు సినిమాలో మాదిరిగా డబ్బు డిమాండ్ చేయాలని వారు ప్లాన్ చేసుకున్నారు. మరుసటి రోజు గోపాల్ పనికి వెళ్లినప్పుడు రోహన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించడం చూశాడు. దాంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారని గ్రహించిన గోపాల్, అతని సహచరులు మృతుడి మొబైల్ ఫోన్‌ను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లారు. పోలీసుల దృష్టి మరల్చడానికి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను నిరంతరం చేంజ్ చేస్తూనే ఉన్నారు. అయితే బురారీలోని ఓ గదిలో రోహాన్ డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.