Monday, November 18, 2024

ఎలుక వ‌ల్ల సైంటిస్ట్ కి క‌రోనా

క‌రోనా తుమ్మినా, ద‌గ్గినా వ్యాపిస్తుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కు తెలిసిన విష‌య‌మే. అయితే ఇప్పుడో సంఘ‌ట‌న ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఓ సైంటిస్ట్ ని క‌రోనా సోకిన ఎలుక క‌ర‌వ‌డంతో అత‌డికి పాజిటీవ్ గా నిర్థార‌ణ అవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ సంఘ‌ట‌న తైవాన్ లోని అత్యంత కట్టుదిట్టమైన బయోసేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలు కలిగిన అకాడమికా సినికా అనే జన్యు క్రమ విశ్లేషణ సంస్థలో జరిగింది. దాదాపు నెల రోజులుగా ఈ ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సంస్థలో పనిచేసే 20 ఏళ్ల సైంటిస్ట్ ల్యాబ్ లో పనిచేస్తుండగా.. కరోనా ఉన్న ఎలుక కరిచినట్టు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు.

అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యువ సైంటిస్ట్ కు ఎలుక కరిచిందని అధికారులు తెలిపారు. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందన్న అనుమానాలు ఉన్నాయి. ఆమె ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకుందని వెల్ల‌డించారు. అయితే, ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందని తేల్చామని, మరిన్ని టెస్టులు చేశాక దానిని నిర్ధారించాల్సి ఉందని సీనియర్ వైరాలజిస్ట్ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement