వయసుతో సంబంధం లేకుండా మరణించే వరకు తానే అధికారం చెలాయిస్తానంటే ఇప్పటి తరం ఆమోదించే పరిస్థితి లేదు. గతంలో పె ద్దరికం, అనుభవాల్ని పరిగణనలోకి తీసుకుని సీనియర్ల ఆకాంక్షకనుగుణంగా సుదీర్ఘకాలం వారి పెత్తనానికి బద్దులయ్యేవారు. కానీ తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీ చీలికను పరికిస్తే దేశవ్యాప్తంగా సీనియర్లు, వయోవృద్ధ రాజకీయ వేత్తలు ఇక సర్దుకోక తప్పదని తేలిపోతోంది. యువతకు పగ్గాలివ్వాంటూ దీర్ఘకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీలన్నీ యువతకే కీలకబాధ్యతలని హామీలు గుప్పిస్తున్నాయి. కానీ ఇవేవీ భారత్‌లో అమలు కావడంలేదు. కాంగ్రెస్‌లో ఏళ్ళ తరబడి అధికారంలో పాతుకుపోవడం ఆనవాయితీగా సాగింది. ఆఖరకు సోనియా వయసు మీరి అనారోగ్యం పాలైనా పరోక్షంగా పార్టీపై పెత్తనం సాగిస్తూనే ఉన్నారు. పేరుకు మల్లిఖార్జున ఖర్గేకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ప్రతి చిన్న విషయాన్ని సోనియాకు నివేదించిన తర్వాతే నిర్ణయాలు ప్రకటించే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. యువకుడైన రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సాహసించలేక పోతున్నారు. జాతీయ పార్టీ బీజేపీలో 75ఏళ్ళ కాలపరిమితి నిర్దేశించారు. అంతకుమించిన వృద్ధనేతలకు పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడం లేదు. కేవలం చట్టసభల్లో ప్రవేశానికి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, గవర్నర్లు, రాష్ట్రపతులుగా సేవలందించడానికే కాదు.. సాధారణ రాజకీయాలకు కూడా వయో పరిమితి నిర్దేశించాల్సిన ఆవశ్యకత దేశంలో నెలకొంది.
న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో యువత ఉన్న దేశం భారత్. కానీ ఈ దేశంలో యువతకు రాజకీయావకాశాలు అందడం లేదు. విదేశాల్లో 50ఏళ్ళలోపే యువత అత్యున్నత స్థానాల్ని చేరుకోగలుగుతున్నారు. సెబాష్టియన్ కుర్జ్ 31ఏళ్ళ వయసులోనే ఆస్ట్రియా ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. 37ఏళ్ళ వయసులో జిసిందా ఆర్డెర్న్ న్యూజిలాండ్‌కు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. టోనీబ్లెయిర్, డేవిడ్ కామెరూన్లో 43వ ఏటే బ్రిటన్ ప్రధానులుగా నియమితులయ్యారు. ఎమాన్యువల్ మెక్రాన్ 39వ సంవత్సరంలో ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
కానీ భారత్కొచ్చేసరికి పార్లమెంట్లో 30ఏళ్ళలోపు ఎంపీల సంఖ్య 14మాత్రమే. కాగా 51మంది 55ఏళ్ళలోపు వయస్సున్న ఎంపీలున్నారు. ఎంపీల సగటు వయసు 51.3 ఏళ్ళు. దేశ జనాభాలో యువత శాతం పెరుగుతోంది. ప్రస్తుతం దేశ యువత సగటు వయసు 25ఏళ్ళు. కానీ దేశంలో రాజకీయ వేత్తలు, చట్టసభల ప్రతినిధుల వయసు మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. తొలి లోక్‌సభలో సభ్యుల సగటు వయసు 46.5ఏళ్ళు కాగా పదో లోక్‌సభ నాటికిది 51.4ఏళ్ళకు పెరిగింది. సెర్బియా వంటి చిన్న దేశం కూడా యువ రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తోంది. ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి సామర్థ్యం కలిగిన యువతను ప్రభుత్వమే గుర్తిస్తోంది. వారికి యంగ్పొలిటికల్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. వారికి పౌరసమాజ విజ్ఞానాన్ని, పాలనా సామర్థ్యాన్ని, నైపుణ్యాల్ని పెంచుతోంది. కెన్యా వంటి దేశం కూడా 2001నుంచి యువ రాజకీయ నాయకత్వాన్ని గుర్తించి తర్ఫీదునిచ్చేందుకు ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అకాడమీలు నిర్వహిస్తోంది.
మొరాకో, కెన్యా, ఈక్విడార్ వంటి దేశాలు కూడా 25ఏళ్ళ లోపు యువతను ప్రోత్సహించి చట్టసభలకు పంపిస్తున్నాయి. బోస్నియాలో ఎన్నికల్లో పోటీ చేసిన వారెవరికి నిర్దిష్ట సంఖ్యలో ఓట్లు రాని పక్షంలో వారిలో పిన్నవయస్కుల్ని విజేతలుగా ప్రకటించే విధానాన్ని అమలు చేస్తోంది. భారత్‌లో మాత్రం ఏళ్ళ తరబడి కొందరు వ్యక్తులే ఇటు పార్టీలు, అటు ప్రభుత్వాల్లో కీలకబాధ్యతలు పోషిస్తున్నారు.
వయోవృద్దులకు ఓటు హక్కు కొనసాగించాలి. పోటీ నుంచి దూరం పెట్టాలి. వారిని సలహాదార్లుగా తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి అనుమతించ కూడదు. ఇప్పటికే 75ఏళ్ళ వయో నిబంధన విధించుకున్న బీజేపీ పాలనా పరంగా పలు సంస్కరణలకు తెరదీసింది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి వయస్సు నిబంధనపై కూడా ప్రస్తుత ప్రభుత్వం చట్టరూపంలో తేవాలని మేథావి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
తిరుగుబాటుకు వయస్సే కారణం!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, సీనియర్ నాయకులు 83ఏళ్ళ శరద్‌పవార్‌పై అంతర్గత తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఆయన సోదరుడి కుమారుడు అజిత్‌పవార్ కూడా అంతర్గత అసమ్మతికి శరద్‌పవార్ వయసే కారణమని తేల్చిచెప్పారు. తనతో సహా పార్టీ సభ్యులంతా శరద్ పవార్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామన్నారు. ఆయన ఆలోచనల్ని మార్గదర్శకంగా భావిస్తామన్నారు. అయితే 83ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ ఆయనే పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తిస్తూ నిర్ణయాలు తీసుకోవడం తమను బాధించిందన్నారు. ఇప్పటికే తమ వయసు కూడా ఐదుపదులు దాటాయి.. ఇంకెప్పుుడు తాము నాయకులమౌతామంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో సీనియర్, వృద్ద నాయకుల పట్ల యువ నాయకుల్లో నెలకొన్న ఆగ్రహంతో పాటు వారి పట్ల ఉన్న గౌరవ భావాలకు అద్దంపడుతోంది.