Monday, November 25, 2024

రెండ‌వ‌సారి సీఎంగా ‘యోగి’ ప్ర‌మాణ స్వీకారం – ’20వేల’ మందికి ఆహ్వానం

రేపే సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ స్వీకారం..యూపీకి రెండోసారి సీఎంగా యోగి బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌నున్నారు. కాగా రేపు అంటే మార్చి 25న సాయంత్రం 4గంట‌ల‌కు ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌నుంది. కాగా ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌రుకానున్నారు. ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా,
రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు…బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారు. కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ , బోనీ కపూర్, అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, సంజీవ్ గోయంకా, ఎన్ చంద్రశేఖర్ లకు కూడా ఆహ్వాన పత్రికలు అందాయి. వీరిలో కొందరు విచ్చేసే అవకాశం ఉంది. 13 అఖాడాల ప్రతినిధులు రానున్నారు. మొత్తంమీద 20 వేల మంది ప్రమాణస్వీకారానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 1985 తరువాత ఏ పార్టీ కూడా తన ఆధిక్యాన్ని కాపాడుకోలేకయింది. రాజకీయ అస్థిరతకు పేరుపడిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల సగటు పదవీ కాలం రెండేళ్ల తొమ్మిది నెలలు మాత్రమే. 1947 నుంచి ఇక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా రెండుసార్లు పదవి చేపట్టలేదు. యోగి ఆదిత్యనాథ్ తాజా విజయంతో ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ట్రెండ్‌ను ఇప్పుడు పూర్తిగా మార్చేశారు. కుల ప్రాతిపదికన విడిపోయిన ఈ రాష్ట్రం ఇప్పుడు మత ప్రాతిపదికనా చీలిపోయింది. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 403 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుని ఏర్పడిన శక్తిమంతమైన బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇదంతా భయంకరంగా కనిపించడం ప్రారంభించింది. ద్రవ్యోల్బనం పెరగడం, నిరుద్యోగం, కరోనా మహమ్మారిని సరైన రీతిలో ఎదుర్కోలేకపోవడం మోడీ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యాలని 2021 ఆగస్ట్‌లో ఇండియాటుడే నిర్వహించిన ఓ పోల్‌లో తేలింది.

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనవరిలో బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్ వాది పార్టీలోకి ఫిరాయించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరంకుశులని, కుల రాజకీయాలు చేస్తారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కొందరు బీజేపీ మద్దతుదారులు కూడా ఊహించని రీతిలో ఆ పార్టీ ఫలితాలు సాధించింది. మోదీ ఆకర్షణ శక్తి, వాక్చాతుర్యం బీజేపీకి తోడ్పడింది. కులాలకు అతీతంగా హిందూ ఓటర్లలో అత్యధికులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతి అయిదుగురు ఓటర్లలో ఒకరు ముస్లిం. బీజేపీ ఈ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. ముస్లింలు ఈ ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీకి మద్దతిచ్చినట్లుగా భావిస్తున్నారు.ముస్లింల ఓట్లు ఎలా అయితే గంపగుత్తగా ఒకే వైపు పడతాయని భావిస్తారో దానికి ప్రతిగా హిందూ ఓట్లు కూడా కన్సాలిడేట్ అయ్యాయి. ఇది బీజేపీకి లాభించింది. బిజెపి విజ‌యానికి బ‌లం చేకూర్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement