కుత్బుల్లాపూర్ (ప్రభ న్యూస్): కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్వగృహానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కుత్బుల్లాపూర్ టికెట్‌ను ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కూడా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ టికెట్ తనకు కావాలని ఆశించారు. ఇదిలా ఉండగా.. ఇవ్వాల వారి భేటీతో ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు తొలిగిపోయాయనే భావన ఉంది.
కాగా, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పూర్తి సహాయకారాలు తనకు ఎంతో అవసరమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాతో పాటు ప్రజల్లో ఇరువురి మధ్య విభేదాలున్నాయని గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. దీంతో వారు ఎడముఖం-పెడ ముఖంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరు ఇవ్వాల మర్యాద పూర్వకంగా కలిసి చర్చించుకోవడంతో పార్టీలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే.. ఎవరి దగ్గరికెళ్తే ఏమౌతుందో అంటూ ఇన్నాళ్లు పార్టీ క్యాడర్ ఇరువురితో మంచిగానే ఉంటూ వచ్చారు. జీహెచ్ఎంసీలోని 5 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు కొంత మంది ఎమ్మెల్సీ వర్గం అనే ముద్ర పడింది. తాజాగా ఇరువురి చర్చలతో మనస్పర్థలకు చెక్ పడినట్టే కానీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
రాజు, వివేక్ మధ్య సఖ్యత కుదిర్చిన పల్లా..
ఇటీవలే బీఆర్ ఎస్ దశాభి ఉత్సవాల సందర్బంగా ఇరువురిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిపినప్పటికి తిరిగి దూరమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆశించడం, ఇప్పటికే రెండుసార్లు వివేక్ గెలవడంతో ఆయన కుత్బుల్లాపూర్ స్థానాన్ని వదులుకోలేదు. ఇదే స్థానం ఎమ్మెల్సీ ఆశించడంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల పార్టీ టికెట్లు కేటాయించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్యే కేపీ వెళ్లాడని కానీ, ఎమ్మెల్సీ రాజు అందుబాటులో లేరని తెలిసింది. సోమవారం ఎమ్మెల్యే వివేక్ ఇంటికి ఎమ్మెల్సీ రాజు వెళ్లగా వివేక్ కూడా అందుబాటులో లేరనే ప్రచారం జరిగింది. తాజాగా ఇరువురు మధ్య జరిగిన చర్చలు దాదాపు ఫల ప్రదమైనట్లు స్పష్టమౌతుంది. గతంలో సైతం వీళ్లిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రాగా, ఓ సారి మంత్రి కేటీఆర్, మరోసారి మంత్రి మల్లారెడ్డి, ఇంకోసారి మైనంపల్లి హన్మంతరావు వీళ్లిద్దరినీ కలిపినట్టు సమాచారం.
తొలుత ఏకాంతంగా.. ఆ తర్వాత ముఖ్య అనుచరులతో..
ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు స్వగృహానికి ఎమ్మెల్యే వివేక్ విచ్చేయగా తొలుత ఇరువురు దాదాపు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఇరువురు తమ తమ ముఖ్య అనుచరులతో తిరిగి భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇరువురు మీడియా ముఖంగా ఏమి చెబుతారో ఏమోనని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.